UPDATES  

NEWS

 మిస్టరీ గా మారిన చిన్నారి ఆచూకీ..! చిన్నారి జ్ఞానేశ్వరి కోసం రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్..

కాకినాడ జిల్లాలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మరింత ముమ్మరమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, అటవీ, రెవెన్యూ, అగ్నిమాపక శాఖలకు చెందిన 400 మంది సిబ్బంది గాలింపులో పాల్గొంటున్నారు.

 

తుని మండలం సిహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో జూన్ 6న చిన్నారి జ్ఞానేశ్వరి తప్పిపోయింది. తోటలో పనిచేసే తల్లిదండ్రులు గణేశ్, భవానీ మధ్య సమన్వయ లోపం కారణంగా పాప అదృశ్యమైంది. ఆ రోజు సాయంత్రం ఒక గ్రామస్థుడు పాపను, దాని పెంపుడు కుక్కను కొండ సమీపంలో చూశాడు. పాపను తీసుకురావడానికి ప్రయత్నించగా, కుక్క అడ్డుకుంది.

 

ఈ కేసులో కీలకమైన పెంపుడు కుక్క శనివారం మృతి చెందడంతో మిస్టరీ మరింత జఠిలంగా మారింది. జూన్ 9న ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చిన ఈ కుక్కకు, పోలీసులు జూన్ 12న జీపీఎస్ ట్రాకర్ అమర్చి పాప ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేశారు. అయితే, ఆ కుక్క అనూహ్యంగా ప్రవర్తిస్తూ, ఆహారం తీసుకోకుండా దాదాపు 80 గంటల పాటు, 8 కిలోమీటర్లు తిరిగి ఇంటికి వచ్చాక మరణించింది. కుక్క మృతికి కారణం తెలుసుకునేందుకు అధికారులు పోస్టుమార్టంకు పంపించారు.

 

ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి జిల్లా యంత్రాంగం లక్ష రూపాయల రివార్డు ప్రకటించింది. అత్యాధునిక డ్రోన్లు, 38 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని విశ్లేషిస్తూ గాలింపు కొనసాగిస్తున్నామని కాకినాడ ఎస్పీ జి.బిందు మాధవ్ తెలిపారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |