UPDATES  

NEWS

 ఫ్యూచర్ సిటీకి తొలి అడుగు.. కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్..

తెలంగాణాను ప్రపంచ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తు ముఖచిత్రాన్ని మార్చబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

 

కేవలం 150 రోజుల రికార్డు సమయంలో ఫ్యూచర్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయ భవనాన్ని పూర్తి చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి, వేగానికి నిదర్శనమని ముఖ్యమంత్రి తెలిపారు. రాబోయే ఎనిమిదేళ్లలో ఫ్యూచర్ సిటీని న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి అంతర్జాతీయ నగరాలకు దీటుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. 2034 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్య సాధనలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.

 

ఈ సందర్భంగా బీఆర్ఎస్‌ పార్టీపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, జీనోమ్ వ్యాలీ వంటి ప్రాజెక్టులతో హైదరాబాద్ విస్తరించడం వల్లే ప్రపంచ పటంలో నగరానికి ప్రత్యేక స్థానం లభించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు తిరస్కరించిన ఆ పార్టీ, అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తే రాజకీయంగా మరింత కనుమరుగవుతుందని హెచ్చరించారు.

 

ఇటీవల కురిసిన వర్షాలకు హైదరాబాద్‌లో రహదారులు జలమయం కావడాన్ని ప్రస్తావిస్తూ.. చెరువులు, నీటి వనరులు ఆక్రమణలే ఇందుకు ప్రధాన కారణమని ముఖ్యమంత్రి అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన భూకబ్జాలను తొలగించి, చెరువులను పునరుద్ధరించడం ద్వారా ‘లేక్ ఎకానమీ’ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ ఏడాది డిసెంబర్‌లో మరో గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

 

హైదరాబాద్ నగరాన్ని నిరంతరం విస్తరించడం వల్లే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ఆయన అన్నారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు బంగారం ధరను మించిపోయాయని పేర్కొన్నారు. ఆనాటి నిజాం రాజులు, కులీకుతుబ్‌షాలు హైదరాబాద్ నగరాన్ని అనేక పర్యాయాలు విస్తరించారని గుర్తుచేశారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని, ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ముఖ్యమంత్రి విమర్శించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |