UPDATES  

NEWS

 విశాఖ స్టీల్‌ప్లాంట్ ఘటనలో కొత్త విషయాలు..కార్మికులపై 1500 డిగ్రీల వేడి మెటల్, కేంద్రమంత్రి ఎక్స్ గ్రేషియా..

విశాఖ స్టీల్‌ప్లాంట్ ఘటనలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిప్పుల కొలిమిలో పని చేసిన శ్రామికులు సలసల మరిగే ద్రావణం పడడంతో ఆనవాళ్లు లేకుండా అదే స్టీల్‌కు ఆహుతై పోయారు. ఘటన జరగడానికి కొద్ది క్షణాల ముందు 12 మంది కార్మికులు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవడంతో వారంతా బయటపడ్డారు. అసలు ఘటన వెనుక ఏం జరిగింది?

 

విశాఖ స్టీల్‌ప్లాంట్ ఘటన కొత్త కొత్త విషయాలు

 

విశాఖ స్టీల్ ప్లాంటులో షాప్‌-1లో బ్లాస్ట్‌ ఫర్నెస్‌ నుంచి టర్బో లాడిల్‌ ద్వారా కన్వర్టర్‌కు ఉక్కు ద్రవం చేర వేస్తారు. వివిధ రకాల వాటిని మిక్స్ చేసిన తర్వాత లాడిల్‌ ద్వారా క్యాస్టింగ్‌ మిషన్‌లకు చేరుస్తారు. అందులో ఆరు క్యాస్టింగ్‌ మిషన్లు ఉంటాయి. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు కన్వర్టర్‌ నుంచి బయలు దేరిన లాడిల్‌-19 క్యాస్టింగ్‌ మిషన్‌లో ద్రవాన్ని పోసేందుకు అధికారులు అనుమతించారు.

 

ఉక్కు ద్రావం వెళ్తున్న లాడిల్‌ పేలిపోయింది. క్రేన్ ద్వారా లాడిల్ పైనుంచి వెళ్తుండగా కింద కార్మికులు ఉన్నారు. దాదాపు 1500 డిగ్రీల సెల్సియస్‌తో ఉక్కు ద్రవం కిందనున్న కార్మికులపై పడడంతో పెద్ద శబ్దం వచ్చింది. ఆ తర్వాత భారీగా మంటలు వ్యాపించాయి. ఘటన జరిగిన సమయంలో సుమారు 14 మంది శాశ్వత, ఒప్పంద కార్మికులు పని చేస్తున్నారు. వారిలో 8 మందిపై ఉక్కు ద్రవం పడిపోయింది.

 

కార్మికులపై పడిన 1500 డిగ్రీల వేడి మెటల్.. మృతుల కుటుంబాలకు కేంద్రమంత్రి ఎక్స్ గ్రేషియా

 

1500 డిగ్రీల వేడితో ఉన్న ద్రవ ఉక్కు పడటంతో కార్మికులు బొగ్గుల్లా మారిపోయారు. ఘటనకు ముందు 12 మంది కార్మికులు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవడంతో బతికి బయటపడ్డారు. నిలబడినవారు అలాగే కాలిపోయారు. మరో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడడంతో వెంటనే వారిని ఉక్కు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నగరంలోని ప్రైవేట్‌ ఆసుపత్రులకు తరలించారు.

 

అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు వైద్యులు. మృతి చెందినవారిలో ప్లాంట్‌కు చెందిన ఐదుగురు ఉద్యోగులు ఉన్నారు. ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. జరిగిన ఘటనపై వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇప్పటికే విచారణ ప్రారంభించింది.

 

ప్రమాదంలోని మరణించినవారిలో గోంతిన భాను కుమార్, జీవీ అప్పారావు, ఎం కృష్ణ నాగు, కె ప్రభాకర్ (ఫోర్ మెన్స్), గోల్డ్ కుమార్ (మేనేజర్ ) ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్టు వర్కర్లలో రమణ, త్రినాధ్, అప్పలరాజు ఉన్నారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

 

ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతి చెందిన కుటుంబాలకు 25 లక్షలు పరిహారం ఇవ్వనుంది. గాయపడిన ఉద్యోగుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాదు ఉద్యోగి రిటైర్మెంట్ వరకు క్వార్టర్స్‌లో నివాసం ఉండేందుకు అవకాశం కల్పించారు.

 

ఇతర ఉద్యోగులతో సమానంగా మృతుల కుటుంబాల పిల్లల చదువులకు ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపారు. చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం ఇవ్వనున్నారు. స్టీల్‌ప్లాంట్ మార్చురీ దగ్గర బాధితులకు నష్ట పరిహారం వివరాలను తెలియజేశారు విశాఖ ఆర్డీవో దిలీప్ చక్రవర్తి.

 

మరోవైపు స్టీల్‌ప్లాంట్ ప్రమాద ప్రాంతాన్ని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, విశాఖ ఎంపీ భరత్ పరిశీలించారు. స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం దురదృష్టకరం, బాధాకరమన్నారు. మృతుల కుటుంబాల భవిష్యత్‌కు స్టీల్ ప్లాంట్ బాధ్యత తీసుకుంటుందన్నారు. నష్టాల నుంచి ప్లాంట్ గాడిన పడుతున్న దశలో ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. ప్లాంటులో ఉత్పత్తికి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టామని అన్నారు. కార్మికులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రమాదంపై బొకారా స్టీల్ ప్లాంట్ సీనియర్ డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణకు ఆదేశించినట్టు సదరు మంత్రి వెల్లడించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |