UPDATES  

NEWS

 కాలేశ్వరం వద్దు.. సిద్ధేశ్వరం ముద్దు.. సీమ ప్రాజెక్టులపై మాధవ్ క్లారిటీ..

కడపలో జరిగిన ‘రాయలసీమ రైజింగ్’ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రాంత భవిష్యత్తుపై సరికొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. రాయలసీమకు ఉన్న అపారమైన వనరులు, ఇక్కడ జరగాల్సిన అభివృద్ధిపై ఆయన కీలక విషయాలు మాట్లాడారు. ప్రస్తుతం చెన్నై-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లు వేగంగా విస్తరిస్తున్నాయని.. వీటి అనుసంధానంతో రాయలసీమ త్వరలోనే ఒక పవర్ హౌస్‌గా మారబోతోందని పేర్కొన్నారు. మరోవైపు విశాఖలో వస్తున్న గూగుల్ సెంటర్ వల్ల రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, ఇటు సీమ యువతకు కూడా కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.

 

రాయలసీమలో అపారమైన ఖనిజ సంపద ఉందని.. అయితే, స్థానికంగా రాజకీయాలు, ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ సంపద దోపిడీకి గురవుతోందని ఆయన ఆరోపించారు. అసలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వెనుక కూడా ఖనిజ సంపద కోసమేనన్న విషయాన్ని మనం గమనించాలన్నారు. ఈ మినరల్ మైనింగ్‌ను సద్వినియోగం చేసుకుంటే ఇక్కడ ఎన్నో కొత్త పరిశ్రమలు వస్తాయని తెలిపారు.

 

మనకు తెలంగాణలోని కాలేశ్వరం లాంటి భారీ, ఆర్థిక భారం కలిగించే ప్రాజెక్టులు వద్దు అని.. రాయలసీమకు ఉపయోగపడే సిద్ధేశ్వరం అలుగు లాంటి ఆచరణాత్మక ప్రాజెక్టులే రావాలని మాధవ్ స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన ఆలయ వ్యవస్థ, సంస్కృతి ఈ సీమ సొంతమన్నారు. మన ఊరు, మన ప్రాంతాన్ని మనమే బాగు చేసుకోవాలనే చైతన్యం అందరిలో రావాలని, ఆ ఉద్దేశంతోనే ఈ ‘రాయలసీమ రైజింగ్’ వేదిక ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |