UPDATES  

NEWS

 ఎవరు పడితే వారు మాట్లాడితే తాట తీస్తాం..! వారికి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..!

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. ఆయన ప్రసంగంలో ఒక కొత్త దూకుడు, హెచ్చరిక ధోరణి స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా పార్టీలోని లోపాలను, విపక్షాల విమర్శలను ఆయన సూటిగా ఎండగట్టారు. తాను ఇప్పటివరకు మౌనంగా ఉన్నానంటే అది చేతకానితనం కాదని, సరైన సమయం కోసం ఎదురుచూస్తూ మరింత గట్టిపడుతున్నానని ప్రత్యర్థులకు బలమైన సంకేతాలు పంపారు. పక్క రాష్ట్రాల్లో ఎవరో గెలవగానే ఇక్కడ విశ్లేషణలు మొదలుపెట్టే వారిపై పవన్ మండిపడ్డారు.

 

రాజకీయాల్లో గెలుపోటములను తాను పట్టించుకోనని, సమస్యను అర్థం చేసుకొని పరిష్కారం వెతకడమే తన నైజమని పవన్ స్పష్టం చేశారు. అయితే, ఇకపై పార్టీలో ఎలాంటి క్రమశిక్షణా రాహిత్యాన్ని, కోవర్టు రాజకీయాలను సహించేది లేదని తేల్చి చెప్పారు. పార్టీ అంతర్గత విషయాలను బయటకు చేరవేసే వాళ్లు ఉంటే ఇప్పుడే వెళ్లిపోవచ్చని గట్టిగా హెచ్చరించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి బలమైన నాయకుడినే ఎదిరించి నిలబడ్డానని, రాజకీయ పార్టీని నడపడం అంత సులువు కాదని గుర్తుచేశారు. కులాల చుట్టూ తిరిగే రాజకీయాలపై అసహనం వ్యక్తం చేస్తూ.. తమిళనాడు రాజకీయాల్లో ఉన్న సానుకూల వాతావరణం మనకు లేకపోవడంపై ఆవేదన చెందారు.

 

అమిత్ షాతో తన భేటీపై జరుగుతున్న ప్రచారాన్ని పవన్ పూర్తిగా కొట్టిపారేశారు. అమిత్ షాను సర్దార్ వల్లభాయ్ పటేల్ స్థాయి నాయకుడిగా అభివర్ణిస్తూ, వారి మధ్య జరిగిన చర్చలు బయట వాళ్లకు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. వైసిపి నేత జైలుకు వెళ్తే తనో, జనసేనో ఎదుగుతామనుకోవడం మూర్ఖత్వమన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి విశ్లేషకులు ఒకరిని టార్గెట్ చేస్తూ మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షాపై కొందరు అవాకులు చవాకులు మాట్లాడితే బీజేపీ నేతల కంటే ముందు ఒక మిత్రుడిగా తనకే ఎక్కువ కోపం వచ్చిందని చెప్పారు. ఇప్పటి నుంచి జనసేనపై ఎవరు పడితే వారు మాట్లాడితే తాట తీస్తామని, పార్టీ నిర్ణయాలతో ధైర్యంగా ముందుకు వెళ్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

 

జగన్‌ను జైలుకు పంపాలని తాను కోరినట్లు ప్రొ.నాగేశ్వర్ చేసిన కామెంట్స్‌పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పరోక్షంగా మండిపడ్డారు. జగన్ జైలుకు వెళ్తే తనకు లాభమనేది పిచ్చి లాజిక్ అని, అదే నిజమైతే చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడే తాను సీఎం అయ్యేవాడినని పేర్కొన్నారు. ఇకపై జనసేనపై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విశ్లేషించే వారిని ప్రశ్నిస్తే కులం కార్డు తెస్తారా అని నిలదీస్తూ, మితిమీరిన సహనం చేతగానితనం అవుతుందని, తనకిక ఓపిక లేదని స్పష్టం చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |