UPDATES  

NEWS

 భారత్‌లో ఏఐ వాడకం జోరు..! ఆఫీసుల్లో 86% ఉద్యోగుల వినియోగం..!

భారతదేశంలోని కార్యాలయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం గణనీయంగా పెరిగింది. దేశంలో దాదాపు 86 శాతం మంది ఉద్యోగులు తమ రోజువారీ పనిలో ఏఐని వాడుతున్నప్పటికీ, దానిపై పెట్టిన పెట్టుబడికి తగిన రాబడి అంచనాలకు తగ్గట్టుగా ఉందని కేవలం 35 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయంలో ప్రపంచ సగటు (22%) కంటే భారత్ మెరుగ్గా ఉండటం గమనార్హం. ఈ వివరాలను టెక్నాలజీ నిపుణుల సంస్థ ఇసాకా (ISACA) సోమవారం విడుదల చేసిన తన నివేదికలో వెల్లడించింది.

 

ఏఐ వాడకంలో భారత్ టాప్

నివేదిక ప్రకారం భారతదేశంలోని 49 శాతం సంస్థలు ఇప్పుడు పూర్తిస్థాయి, అధికారిక ఏఐ విధానాన్ని కలిగి ఉన్నాయి. 2025లో ఇది 32 శాతంగా ఉండగా, ఇప్పుడు గణనీయంగా పెరిగింది. ప్రపంచ సగటు 38 శాతంతో పోలిస్తే ఇది అధికం. అయినప్పటికీ దేశంలోని 23 శాతం సంస్థలు పరిమిత విధానాలతోనే సరిపెడుతుండగా, 20 శాతం సంస్థల్లో అసలు ఎలాంటి ఏఐ పాలసీ లేకపోవడం గమనార్హం. రోజువారీ పనుల్లో ఏఐ భాగమైనప్పటికీ పాలన, కార్యాచరణ సంసిద్ధతలో ఇంకా వెనుకబాటుతనం కనిపిస్తోందని నివేదిక పేర్కొంది.

 

రాబడిపై మాత్రం మిశ్రమ స్పందన

రాబడి విషయంలో ఉద్యోగుల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. సుమారు 21 శాతం మంది రాబడి గురించి చెప్పడానికి ఇది చాలా తొందరపాటు అవుతుందని అభిప్రాయపడగా, మరో 21 శాతం మంది ఇప్పటివరకు పరిమిత రాబడి మాత్రమే వచ్చిందని తెలిపారు. ఇంకో 18 శాతం మందికి రాబడిపై ఎలాంటి అవగాహన లేదని తేలింది.

 

భారతీయ ఉద్యోగులు ప్రధానంగా ఉత్పాదకత పెంచుకోవడానికి (56%), పునరావృతమయ్యే పనులను ఆటోమేట్ చేయడానికి (55%), కంటెంట్ రాసేందుకు (51%), భారీ డేటాను విశ్లేషించడానికి (42%) ఏఐని ఉపయోగిస్తున్నట్లు సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో 82 శాతం మంది తమ వృత్తికి ఏఐ నైపుణ్యాలు చాలా అవసరమని భావిస్తున్నారు. రాబోయే 12 నెలల్లో తమ సంస్థలో ఏఐ సంబంధిత ఉద్యోగాలు పెరుగుతాయని 57 శాతం మంది అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఇది 46 శాతంగా ఉంది.

 

ఈ ఫలితాలపై ఇసాకా ఏఐ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ సీనియర్ మేనేజర్ కీత్ బ్లూమ్‌ఫీల్డ్-డివీస్ స్పందిస్తూ, “ఏఐ వల్ల ప్రయోజనాలు ఉన్నాయని చూపించాలనే ఒత్తిడి సంస్థలపై విపరీతంగా ఉంది. కానీ, చాలా సంస్థలకు రాబడిపై ఇంకా స్పష్టత రాలేదు. ఏఐలో పెట్టుబడికి రాబడి అనేది అనుకున్న సమయానికి రాదు. సిబ్బంది, ప్రక్రియలు, పాలనా నిర్మాణంపై నిరంతరం పెట్టుబడులు పెట్టినప్పుడే సరైన ఫలితాలు వస్తాయి” అని వివరించారు. ఈ సర్వేలో భారత్ నుంచి 265 మంది సహా ప్రపంచవ్యాప్తంగా 3,400 మంది డిజిటల్ నిపుణులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |