UPDATES  

NEWS

 తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన… జూన్ 25 నుంచి ఇంటింటి సర్వే ..

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. సుమారు 25 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) – 2026’ కార్యక్రమాన్ని జూన్ 25 నుంచి చేపట్టనున్నారు. ఈ కార్యక్రమ సన్నద్ధతపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి గురువారం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

 

జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓలు), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్ఓలు), అదనపు సీఈఓ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డితో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, కచ్చితత్వంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు), ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటూ, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

 

ఈ ప్రక్రియలో భాగంగా జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించి, వాటిని ధృవీకరిస్తారు. నకిలీ, మరణించిన మరియు చిరునామా మారిన ఓటర్లను జాబితా నుంచి తొలగించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 35,000 మందికి పైగా బీఎల్ఓలు, దాదాపు 26,000 మంది బూత్ లెవల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించనున్నారు.

 

2026 అక్టోబర్ 1వ తేదీని అర్హత తేదీగా ప్రామాణికంగా తీసుకుని తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 3.39 కోట్ల మంది ఓటర్ల వివరాలను ఈ సర్వేలో సమగ్రంగా పరిశీలించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ ఓటు వివరాలను సరిచూసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |