UPDATES  

NEWS

 భారత వ్యవసాయ రంగంలో ఒక కీలకమైన మైలురాయి..! విత్తనాలకు స్మార్ట్ కోటింగ్…

భారత వ్యవసాయ రంగంలో ఒక కీలకమైన మైలురాయి నమోదైంది. విత్తన నాణ్యతను మెరుగుపరిచి, పంట దిగుబడిని గణనీయంగా పెంచే లక్ష్యంతో ‘స్మార్ట్ సీడ్ కోటింగ్’ సాంకేతికతను భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఆవిష్కరించింది. ఈ బయోపాలిమర్ ఆధారిత టెక్నాలజీ ద్వారా క్షేత్రస్థాయి ప్రయోగాల్లో 30 శాతం వరకు అదనపు దిగుబడి సాధించినట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లోని ఐసీఏఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ ఈ నూతన విధానాన్ని అభివృద్ధి చేసింది.

 

ఈ సాంకేతికతలో భాగంగా విత్తనం చుట్టూ బయోపాలిమర్‌లతో కూడిన ఒక ప్రత్యేక పూతను వేస్తారు. ఇది విత్తనానికి అవసరమైన పోషకాలు, సూక్ష్మజీవులను అందిస్తూ, చీడపీడల నుండి రక్షణ కల్పించే కవచంలా పనిచేస్తుంది. దీనివల్ల విత్తనం త్వరగా మొలకెత్తడంతో పాటు వేర్లు బలంగా విస్తరిస్తాయి. తద్వారా పంట ప్రాథమిక దశలో ఎదురయ్యే ప్రతికూల వాతావరణ మార్పులను మొక్కలు సమర్థవంతంగా తట్టుకుంటాయి.

 

తెలంగాణలో వేరుశనగ, సోయాబీన్ పంటలపై నిర్వహించిన ప్రయోగాల్లో సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే దాదాపు 30 శాతం అధిక దిగుబడి నమోదైంది. అలాగే, దేశవ్యాప్తంగా మొక్కజొన్న, పత్తి, కంది, ఆవాలు వంటి వివిధ పంటలపై చేపట్టిన పరీక్షల్లో ఉత్పాదకత 12 శాతం నుండి 37 శాతం వరకు పెరిగినట్లు వెల్లడైంది.

 

వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులతో సతమతమవుతున్న రైతులకు ఈ సాంకేతికత ఎంతో ఆశాజనకంగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ నూతన టెక్నాలజీని దేశవ్యాప్తంగా రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేయడానికి ఐసీఏఆర్ సన్నాహాలు చేస్తోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |