బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్‌కు కూడా క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును నిస్సిగ్గుగా అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి రోజు అని, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను అధికార పక్షం తమకు అనుకూలంగా వాడుకుంటోందని ఆరోపించారు.
మరోవైపు, స్పీకర్ నిర్ణయాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వాగతించారు. తాము సాంకేతికంగా ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యులమేనని, తమపై వేసిన పిటిషన్లు చట్టబద్ధమైనవి కావని ఆయన స్పష్టం చేశారు. తమ జీతం నుండి ప్రతి నెలా బీఆర్‌ఎస్‌ఎల్పీకి రూ. 5 కట్ అవుతోందని, దీన్ని బట్టి తాము పార్టీలోనే ఉన్నట్లు అర్థమవుతోందని పేర్కొన్నారు. గతంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఎమ్మెల్యేలను మంత్రులుగా చేసిన చరిత్ర బీఆర్ఎస్‌ది కాదా అని కడియం శ్రీహరి ఎదురుదాడి చేశారు.
కాగా, స్పీకర్ నిర్ణయంతో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి వెళ్లిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు అనర్హత వేటు నుండి ఊరట లభించినట్లయింది. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరికపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి వారికి ఇప్పటికే స్పీకర్ దశలవారీగా క్లీన్ చిట్ ఇచ్చారు. తాజా నిర్ణయంతో ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెను దుమారం రేపుతోంది.








