UPDATES  

NEWS

 జగన్ రాజకీయ భవిష్యత్తు కటకటాలే..! మంత్రి మండిపల్లి షాకింగ్ కామెంట్స్..!

అమరావతి వేదికగా రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై, ఆయన రాజకీయ వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్‌సీపీ నిజరూపం బయటపడిందని పేర్కొంటూ, గత ప్రభుత్వం ప్రతిపాదించిన సంక్షేమ పథకాలు విఫలమయ్యాయని దుయ్యబట్టారు.

జగన్మోహన్ రెడ్డి నడిపేది ప్రజా పార్టీ కాదని, అది ఒక గొడ్డలి పార్టీ అని మంత్రి మండిపల్లి వ్యాఖ్యానించారు. ఐదేళ్లపాటు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తన సొంత బాబాయి హత్య కేసులో నిందితులను పట్టుకోవడంలో జగన్ విఫలమయ్యారని మండిపడ్డారు. ఈ హత్యతో అంతిమంగా లబ్ధి పొందింది జగనేనని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని, ఈ విషయంలో ఆయన మౌనంగా ఉండటం నేరాంగీకారానికే సంకేతమని అన్నారు. కేసులోని నిజాలు పూర్తిగా వెలుగులోకి వస్తే ఆయన రాజకీయ భవిష్యత్తు ముగిసిపోవడం ఖాయమని హెచ్చరించారు.

గత ప్రభుత్వం పేదల సొంతింటి కలను పూర్తిగా చిదిమేసిందని, అయితే ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుంటే, దానిని అడ్డుకునేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ‘అమరజీవి జలధార’ ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు, అలాగే ‘పల్లె పండుగ 3.0’ కింద రూ.11,000 కోట్లతో గ్రామాల్లో వేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు.

రాయలసీమకు సాగునీరు అందించే హంద్రీ-నీవా ప్రాజెక్టుకు ఎన్టీఆర్ శ్రీకారం చుడితే, చంద్రబాబు నాయుడు దానిని పూర్తి చేసి కుప్పం వరకు నీళ్లు అందించారని గుర్తుచేశారు. సీమను హార్టీకల్చర్ హబ్‌గా మార్చేలా ‘రాయలసీమ రైజింగ్’ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. గతంలో టీడీపీ నాయకులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నవారు నేడు పారదర్శకత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఏకగ్రీవాలు తమ విధానం కాదని, పారదర్శక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల సమర్థవంతమైన అమలే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |