UPDATES  

NEWS

 లష్కరే తోయిబా భారీ కుట్ర.. కాశ్మీర్‌లోకి 10,000 మంది ఉగ్రవాదులు..!

జమ్మూకాశ్మీర్ లో భారీ విధ్వంసానికి పాక్ కుట్ర పన్నిందా? వేలాది మంది ఉగ్రవాదులను సరిహద్దులు దాటించిందా? అంటే నిజమనే అంటున్నాడు పాక్ మత ప్రబోధకుడు నాసిర్ మద్నీ (Nasir Madni). నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఓ కార్యక్రమంలో తాజాగా పాల్గొన్న ఆయన.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్.. జమ్మూ కాశ్మీర్ లోకి ఏకంగా 10,000 మంది ఉగ్రవాదులను పంపాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు భారత్ ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

పాకిస్తాన్‌లోని బహావుల్‌నగర్‌ (Bahawalnagar) లో నిర్వహించిన లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) కార్యక్రమంలో నాసిర్ మద్నీ ప్రసంగించాడు. ఇటీవల తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన కోలుకున్న తర్వాత మొదటిసారిగా ఈ బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా సయీద్‌ను ప్రశంసిస్తూ ఆయన తన మాతృభూమి కోసం ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడాడు. ఇదే క్రమంలో కాశ్మీర్ లోయలోకి సయీద్ 10,000 మంది ముష్కరులను పంపాడని వ్యాఖ్యానించాడు. ఈ సంఖ్యకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ.. కాశ్మీర్‌లో ఉగ్రవాద వ్యాప్తికి సయీద్ ఇంకా కుట్రలు చేస్తున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది.

ఇదిలా ఉంటే భారత్‌లో జరిగిన అనేక భారీ ఉగ్ర దాడుల వెనుక హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. అతడు స్థాపించిన లష్కరే తోయిబాను 2005లోనే ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా ప్రకటించగా.. 2008లో అమెరికా ప్రభుత్వం సయీద్‌ను ‘గ్లోబల్ టెర్రరిస్ట్’గా గుర్తించింది. మరోవైపు 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన మరణహోమం వెనుక మాస్టర్ మైండ్ గా హఫీజ్ సయీద్ ఉన్నాడు. నగరంలో 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు.

అయితే పాకిస్తాన్‌ ప్రభుత్వం సయీద్‌కు రక్షణ కల్పిస్తున్నట్లు భారత్ ఆరోపిస్తోంది. 2025 ఏప్రిల్ లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి వెనుక కూడా సయీద్ పాత్ర ఉన్నట్లు పేర్కొంది. 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనకు సంబంధించి జమ్మూ కోర్టు సయీద్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ సైతం జారీ చేసింది. కాగా, పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న ఉగ్రవాదులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందని భద్రతా బలగాలు పేర్కొన్నాయి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |