UPDATES  

NEWS

 కూతురి సంచలన వ్యాఖ్యలు.. కొండా సురేఖకు కాంగ్రెస్‌ నోటీసులు..

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు సంబంధించి మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి జి. చిన్నారెడ్డికి కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

సురేఖ కుమార్తె వ్యాఖ్యలపై..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన బహిరంగ వ్యాఖ్యలను పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యాఖ్యలపై మంత్రి సురేఖ నుంచి వివరణ కోరింది.

పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ప్రభుత్వ పెద్దలపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్‌ నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై మూడు రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని సురేఖను ఆదేశించింది.

ఇటీవల జరిగిన ఓ సభలో రేవూరి ప్రకాశ్‌ రెడ్డిని మరోసారి గెలిపించాలని సీఎం రేవంత్‌ పిలుపునిచ్చారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సుష్మిత.. అధిష్ఠానాన్ని సంప్రదించుకుండా మీరెలా అభ్యర్థిని ప్రకటిస్తారని సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. టికెట్‌ ఇచ్చినా.. ఇవ్వకపోయినా పరకాల నుంచి తాను పోటీ చేసి గెలిచి తీరతానని తేల్చి చెప్పారు.

చిన్నారెడ్డికి కూడా నోటీసు
మరోవైపు వనపర్తి జిల్లా కాంగ్రెస్‌లోనూ వివాదం తెరపైకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యేపై బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి జి. చిన్నారెడ్డికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. తన వ్యాఖ్యలపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. 

డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే సీట్లు కేటాయించారని ఇటీవల చిన్నారెడ్డి ఆరోపించారు. అందుకే తనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో సీటు రాలేదని పేర్కొన్నారు. ఫలితంగా వనపర్తి నియోజకవర్గాన్ని నాశనం చేశారని తెలిపారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని.. అవినీతికి పాల్పడేవారిని బయటకు గెంటేస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సొంత పార్టీ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ నేతలపై పార్టీ లైన్‌ దాటి బహిరంగంగా విమర్శలు చేస్తే సహించబోమని క్రమశిక్షణ కమిటీ హెచ్చరించినట్లు సమాచారం.

ఇద్దరు సీనియర్‌ నేతలకు ఒకేసారి నోటీసులు జారీ కావడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ చర్చ మొదలైంది. పార్టీ టికెట్ల అంశం చుట్టూ కొనసాగుతున్న అసంతృప్తి ఈ పరిణామాలతో మరోసారి బయటపడినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |