UPDATES  

NEWS

 భూలక్ష్మి పేరుతో కవిత బిగ్ అనౌన్స్‌మెంట్..! ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి ఫ్రీ..

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పేదల సంక్షేమం లక్ష్యంగా ఓ భారీ ప్రకటన చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం చొప్పున భూమిని పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె, ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాలను, పార్టీ భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించారు.

పేదల ఆర్థికాభివృద్ధికి భూమే మూలాధారమని భావించిన కవిత, దీనికోసం ‘భూలక్ష్మి’ అనే ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో గుణాత్మక మార్పు రావాలంటే పేద వర్గాలకు శాశ్వత ఆస్తిగా భూమిని అందించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో వెనుకబడిన వారికి భరోసా ఇవ్వడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

తమ పార్టీ ప్రాథమిక లక్ష్యం పేదవారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమేనని కవిత ఉద్ఘాటించారు. కేవలం సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాకుండా, వారి సొంత కాళ్లపై వారు నిలబడేలా చేయడమే తమ ధ్యేయమని వివరించారు. ఎకరం భూమి ఇవ్వడం ద్వారా ప్రతి పేద కుటుంబానికి సమాజంలో గుర్తింపు, ఆర్థిక భద్రత లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కవిత కీలక సూచన చేశారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ‘భూలక్ష్మి’ పథకాన్ని ఇప్పుడు అమలు చేయడానికి ముందుకు వస్తే.. తమ పార్టీ తరఫున మొదటగా స్వాగతించి, పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం విషయంలో రాజకీయం కంటే ప్రజల మేలే ముఖ్యమని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |