UPDATES  

NEWS

 ఆదిలాబాద్ టు అసెంబ్లీ.. రైతు సమస్యలపై బీజేపీ సమరభేరి..!

రైతు సమస్యలను ప్రధాన అజెండాగా చేసుకుని తెలంగాణలో బీజేపీ మరో ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతోంది. రైతుల సమస్యలను క్షేత్రస్థాయి నుంచి అసెంబ్లీ వరకు తీసుకెళ్లే లక్ష్యంతో వచ్చే నెలలో ప్రత్యేక యాత్ర చేపట్టాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ లోని అసెంబ్లీ వరకు ఈ యాత్రను చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ యాత్రకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నేతృత్వం వహించనున్నారు. సుమారు 25 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్రలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, వాటిపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ బీజేపీ భావిస్తోంది. ముఖ్యంగా రైతులకు పంటల బీమా పథకాన్ని సమర్థంగా అమలు చేయాలనే డిమాండ్‌ను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.

పంట నష్టపోయిన సమయంలో రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంలో పంటల బీమా కీలకమని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో పంటల బీమా అమలు తీరుపై రైతుల్లో ఉన్న ఆందోళనలను యాత్ర సందర్భంగా వెలుగులోకి తీసుకురావాలని పార్టీ యోచిస్తోంది. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి వినతులు, అభిప్రాయాలు స్వీకరించి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేలా కార్యక్రమాన్ని రూపొందించనున్నట్లు సమాచారం. పంటల బీమాతో పాటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ రైతులకు ఇచ్చిన హామీల అమలుపైనా బీజేపీ దృష్టి సారించనుంది. రైతు రుణమాఫీ, రైతుభరోసా, పంటల మద్దతు, రైతులకు సంబంధించిన ఇతర హామీల అమలు తీరును ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హామీలను కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితం చేయకుండా, వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేయనున్నారు.

రైతులతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుని, వాటిని అసెంబ్లీ వేదికగా ప్రస్తావించడమే యాత్ర ప్రధాన ఉద్దేశంగా తెలంగాణ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆదిలాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే యాత్రకు మార్గమధ్యంలో రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ రంగ నిపుణులతో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. చివర్లో అసెంబ్లీని కేంద్రంగా చేసుకుని రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో రైతు సమస్యలను రాజకీయంగా మరింత బలమైన అంశంగా మార్చేందుకు ఈ యాత్రను బీజేపీ ఉపయోగించుకోవాలని భావిస్తోంది. దీంతో సెప్టెంబర్ ప్రారంభం కానున్న యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పునకు కారణమవుతుందో చూడాలి. రైతులు బీజేపీని ఆదరిస్తారా? లేదా? అనేది చూడాలి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |