UPDATES  

NEWS

 రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా..? కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..!

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో నిరుద్యోగ యువత తీవ్ర ఆవేదనకు గురవుతోందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. ఎన్నికల ముందు ‘యూత్‌ డిక్లరేషన్‌’ పేరిట పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కాంగ్రెస్, ఇప్పుడా హామీలను పూర్తిగా పక్కనబెట్టిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల హామీలు నెరవేరకపోవడంతో విసిగిపోయిన ఓ యువకుడు చివరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం అత్యంత బాధాకర మన్నారు. నిరుద్యోగుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగలక తప్పదని హెచ్చరించారు.

నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం

రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 20 వేల వరకు పోలీసు ఉద్యోగాల ఖాళీలు ఉంటే, కేవలం 7 వేల పోస్టులకే నోటిఫికేషన్‌ ఇవ్వడం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీ గురించి అడిగిన యువతకు సానుకూలంగా సమాధానం చెప్పాల్సింది పోయి, కొందరు ముఖ్య నేతలు నిర్లక్ష్యంగా మాట్లాడటం దారుణమన్నారు. ఉద్యోగాలు అడిగితే విషం తాగి చావాలని అనడం, చదువుకున్న ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లను ‘క్రిమినల్‌ వేస్ట్‌’ అని సీఎం సంబోధించడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.

యూత్‌ డిక్లరేషన్‌ అమలు ఏది?

ఎన్నికల సమయంలో యూత్‌ డిక్లరేషన్‌ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా 24 హామీలను ఇచ్చిందన్నారు. అందులో ఇప్పటివరకు ఒక్కటైనా నెరవేర్చారా అని కేటీఆర్‌ సూటిగా ప్రశ్నించారు. నిరుద్యోగ యువతను దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. స్వయంగా రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చిన ఈ అంశాలపై సీఎం రేవంత్‌ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలన్నారు. అత్యధిక క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న రేవంత్‌రెడ్డే నిజమైన క్రిమినల్‌ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రేవంత్ చదువుపై అనుమానాలు

ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి అసలు ఏం చదువుకున్నారో కూడా తనకు అనుమానంగా ఉందంటూ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. కనీసం ఆయన ఎన్నికల నామినేషన్‌ పత్రాలను సొంతంగా నింపుకోగలరా అని ప్రశ్నించారు. తన జీవితంలో ఏనాడైనా ఒక్క ఇంటర్వ్యూకైనా వెళ్లిన అనుభవం రేవంత్‌రెడ్డికి ఉందా అని కేటీఆర్‌ విమర్శించారు. చదువు విలువ, ఉద్యోగం కోసం పడే కష్టం తెలియని వ్యక్తే యువతను ఈ రకంగా అవమానిస్తారని కేటీఆర్‌ మండిపడ్డారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |