UPDATES  

NEWS

 బీజేపీకి భారీ షాక్.. బంకీపూర్ కోట బద్దలు కొట్టిన ప్రశాంత్ కిశోర్..

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ (పీకే) ప్రత్యక్ష రాజకీయాల్లో సంచలన విజయాన్ని నమోదు చేశారు. బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన ఘన విజయం సాధించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో, ఆ పార్టీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై సుమారు 19,324 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

సోమవారం జరిగిన ఓట్ల లెక్కింపులో మొత్తం 32 రౌండ్ల ముగిసేసరికి ప్రశాంత్ కిశోర్‌కు 64,151 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌కు 44,827 ఓట్లు పోలయ్యాయి. ఇక ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 14,273 ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఈ విజయంతో ప్రశాంత్ కిశోర్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఆయన స్థాపించిన జన సురాజ్ పార్టీకి సైతం ఇదే తొలి ఎన్నికల విజయం కావడం విశేషం.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో బంకీపూర్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 1995 నుంచి (గతంలో పట్నా పశ్చిమ స్థానంగా పిలిచేవారు) ఈ నియోజకవర్గం బీజేపీకి తిరుగులేని కోటగా ఉంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జన సురాజ్ పార్టీ అనేక స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో పీకే సాధించిన విజయం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

ఈ ఫలితంపై బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, మంత్రి విజయ్ కుమార్ సిన్హా స్పందిస్తూ, ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రశాంత్ కిశోర్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ ఉప ఎన్నికలో కేవలం 34.30 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడం గమనార్హం. పాట్నా లాంటి పట్టణ ప్రాంతంలో, బీజేపీకి అత్యంత పట్టున్న స్థానంలో ప్రశాంత్ కిశోర్ విజయం సాధించడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |