UPDATES  

NEWS

 ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కేసు కొత్త మలుపు..! ఏపీ మహిళతో రిలేషన్..?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసు ఎంతవరకు వచ్చింది? తీగలాగితే డొంక కదులుతోందా? తాజాగా మరో మహిళతో అతడికి రిలేషన్ షిప్ ఉందా? గదిలో ప్రేమ లేఖల మాటేంటి? సదరు మహిళ ఏపీకి చెందిన మహిళా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన మరో మహిళతో సన్నిహిత సంబంధాలున్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బాధిత ట్రైనీ మహిళా ఐపీఎస్‌ ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఆ దిశగా దర్యాప్తు చేసిన అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం. ఈ కేసులో సుమారు 20 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌లో చేసిన పోలీసులు, అశోక్‌నగర్‌లోని ఉదయ్‌ కృష్ణారెడ్డి గదిలో సోదాలు చేపట్టారు. అక్కడి నుంచి ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్, ఓ కత్తి, ఇద్దరు వ్యక్తుల చేతి రాతతో ఉన్న రెండు లేఖలు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమలేఖలపై రాసిన పేర్ల ఆధారంగా ఆరా తీశారు పోలీసులు.

ఏపీ మహిళతో రిలేషన్

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళతో సన్నిహిత సంబంధం ఉన్న విషయం బయటపడింది. ఆ మహిళకు 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. గడిచిన మూడేళ్లుగా భర్తకు దూరంగా కుమారుడితో కలిసి ఉంటోందట. ఈ సమయంలో ఆమెకు పరిచయమైన ఉదయ్‌, ఆ తర్వాత ఇరువురు మధ్య స్నేహం చిగురించింది. హైదరాబాద్‌ వచ్చిన ఆమె కొంతకాలం ఓ ప్రైవేటు సంస్థలో పని చేశారు. జనవరిలో ఉదయ్‌ సలహాతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అశోక్‌నగర్‌లోని ఓ ఐఏఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఆమె చేరినట్టు సమాచారం. లివ్‌ ఇన్‌ రిలేషన్‌లో ఉందామని ఉదయ్‌ కోరినా చట్టప్రకారం విడాకులు రాకపోవటంతో సదరు మహిళ తిరస్కరించినట్టు సమాచారం.

అశోక్‌నగర్‌లో ఉన్న ఆ మహిళను ఈ ఏడాది ఫిబ్రవరిలో బాధిత మహిళా ట్రైనీ ఐపీఎస్‌ కలిశారు. తాను ఉదయ్‌కృష్ణారెడ్డితో సన్నిహితంగా ఉన్నానని, తనపై దాడి చేయటమే కాకుండా వింత ప్రవర్తనతో ఇబ్బంది పెడుతున్నాడంటూ తన బాధను పంచుకున్నట్లు సమాచారం. ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత సదరు మహిళ ఉదయ్‌కి దూరంగా ఉంటున్నట్టు విచారణలో గుర్తించారు పోలీసులు.

మహిళా ట్రైనీ ఐపీఎస్‌ గదిలోకి చొరబడిన నిందితుడు ఆమె ఫోన్‌ లాక్కున్నమాట వాస్తవమేనని అంటున్నారు. దానికి సంబంధించి ఆధారాలు సేకరించారు పోలీసులు. లభించిన ఆధారాలతో నిందితుడు ఉదయ్‌ని కస్టడీకి తీసుకొని మరికొన్ని వివరాలు రాబట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ట్రైనీ మహిళా ఐపీఎస్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఉదయ్‌ కృష్ణారెడ్డిపై అత్తాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును డీసీపీ లావణ్య నాయక్‌ జాదవ్‌ దర్యాప్తు పర్యవేక్షిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |