UPDATES  

NEWS

 ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు విషయంలో ఏం జరిగింది..? వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు..

రెండేళ్లు ప్రశాంతంగా ఉన్న వైసీపీ నేతలు దూకుడు పెంచారా? వరుసగా నమోదవుతున్న కేసులు వెనుక ఏం జరుగుతోంది? నేతలపై కేసులతో ఆ పార్టీ నేతలు బెంబేలెత్తుతున్నారా? ఇంతకీ ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి విషయంలో ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు

కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని ఆదివారం రాత్రి అరెస్టు చేశారు పోలీసులు. ఆయనతోపాటు 15 మందిని న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఆలూరు కోర్టు అందరికీ 14 రోజులు రిమాండ్ విధించింది. ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షితోపాటు మిగతావారిని కర్నూలు సబ్ జైలుకు తరలించారు. రాత్రి అక్కడే గడిపారు. సోమవారం వారి విడుదల కోసం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. నెమకల్- సంగాల గ్రామాల మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత పెంచారు. అసలు ఘటన వెనుక ఏం జరిగింది?

చిప్పగిరి మండలం నేమకల్లు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గురునాథ్-సంగాలకు చెందిన వైసీపీ కార్యకర్త గిరి ఫోన్‌లో వ్యక్తిగత దూషణలు చేసుకున్నారు. వీరిద్దరి మధ్య వివాదం కాస్త గాలివానగా మారింది. ఆ తర్వాత గొడవకు దారి తీసింది. ఈ విషయాన్ని వైసీపీకి చెందిన గిరి.. ఎమ్మెల్యే విరూపాక్షి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన తన అనుచరులతో కలిసి నేమకల్లు గ్రామానికి వెళ్లడం వివాదం మరింత జఠిలమైంది. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడం, ఆపై రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త శేఖర్, నాగరాజు గాయాలయ్యాయి. పలువురు వైసీపీ కార్యకర్తలతోపాటు ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు ఎడమచేతికి గాయాలు అయ్యాయి.

రాత్రంతా జైలులో ఎమ్మెల్యే

చిప్పగిరి పోలీస్ స్టేషన్ ఎదుట అర్ధరాత్రి ఎమ్మెల్యే విరుపాక్షితోపాటు పలువురు, టీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలని ఆందోళనకు దిగారు. టీడీపీ కార్యకర్త శేఖర్ ఫిర్యాదు చేశాడు. మొత్తం 34 మందిపై కేసులు నమోదు అయ్యాయి. చిప్పగిరి పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గ్రామంలో జరిగిన చిన్నపాటి గొడవలు కాస్త వైసీపీ ఎమ్మెల్యే జైలుకి వెళ్లే పరిస్థితి నెలకొంది. జరుగుతున్న పరిణామాలను వైసీపీ హైకమాండ్ మింగుడుపడడం లేదు. మొన్న తమ్మినేని, ఇప్పుడు విరూపాక్షి వంటి నేతలపై కేసులు నమోదు కావడం ఆ పార్టీలోని నేతలకు మింగుడుపడడం లేదు. కవ్వించి కయ్యానికి వెళ్లేబదులు సైలెంట్‌గా ఉండడం బెటరనే వాదన అప్పుడే నేతల్లో వినిపిస్తోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |