UPDATES  

NEWS

 PoK Polls: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ఎన్నికల్లో PML-N ఆధిక్యం.. నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) అసెంబ్లీ ఎన్నికల్లో షాబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి రెండు దశల పోలింగ్‌లో ఆ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఇదే సమయంలో ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి. PML-N విజయం సాధిస్తే తనను PoK ప్రధానమంత్రిగా చేయాలని ప్రధాని షాబాజ్ షరీఫ్‌ను కోరుతానని ఆయన వ్యాఖ్యానించారు.

జూలై 27న జరిగిన తొలి దశ పోలింగ్‌లో మీర్‌పూర్ డివిజన్‌లోని 13 స్థానాల్లో PML-N తొమ్మిది స్థానాలు గెలుచుకోగా, పీపుల్స్ పార్టీ (PPP) నాలుగు స్థానాలను దక్కించుకుంది. ఆగస్టు 2న జరిగిన రెండో దశలోనూ ముజఫరాబాద్ డివిజన్, శరణార్థుల నియోజకవర్గాల్లో PML-N ఆధిపత్యం కొనసాగింది. తొలి రెండు దశల్లో కలిపి సుమారు 23 స్థానాలు సాధించినట్లు సమాచారం. మొత్తం 53 స్థానాలున్న అసెంబ్లీలో 45 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతుండగా, మిగిలిన ఎనిమిది స్థానాలు మహిళలు, టెక్నోక్రాట్లు, మత నాయకులకు రిజర్వ్‌గా ఉన్నాయి. మూడో దశ పోలింగ్ ఆగస్టు 10న జరగాల్సి ఉంది.

అయితే నవాజ్ షరీఫ్ PoK ప్రధానమంత్రి కావాలనే వ్యాఖ్యలపై న్యాయపరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. PoK రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రధానమంత్రి పదవికి ఆ ప్రాంతానికి చెందిన ఓటరు, శాసనసభ సభ్యుడు కావాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం నవాజ్ షరీఫ్ పంజాబ్‌కు చెందిన నాయకుడు కావడంతో పాటు PoK అసెంబ్లీకి పోటీ చేయలేదు. మరోవైపు, భారత్ PoKలో నిర్వహించే ఎన్నికలను గుర్తించదు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని, పాకిస్థాన్ వాటిని అక్రమంగా ఆక్రమించిందని భారత్ తన వైఖరిని స్పష్టం చేస్తూ వస్తోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |