UPDATES  

NEWS

 కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు..!

ముంబై నటి కాదంబరి జత్వాని ఉదంతం ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి తీవ్ర సంచలనంగా మారింది. గతంలో పలువురు పోలీసు అధికారుల సస్పెన్షన్‌కు కారణమైన ఈ వ్యవహారంలో విజయవాడ సీఐడీ కోర్టులో దాఖలైన ఛార్జ్‌షీట్‌తో ఒక ఊహించని మలుపు చోటుచేసుకుంది. నటి కాదంబరి జత్వానినే వైఎస్సార్‌సీపీ నేత విద్యాసాగర్‌ను బ్లాక్‌మెయిల్ చేసి, పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు సీఐడీ తన విచారణలో తేల్చడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

 

అసలేం జరిగిందంటే..?

 

సీఐడీ కోర్టుకు సమర్పించిన ఛార్జ్‌షీట్ ప్రకారం.. కుక్కల విద్యాసాగర్‌తో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలను ఆసరాగా చేసుకుని కాదంబరి జత్వాని ఈ దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. వారిద్దరూ కలిసి ఉన్న సమయంలో తీసిన కొన్ని వ్యక్తిగత ఫోటోలను చూపించి, వాటిని బయటపెడతానంటూ ఆమె విద్యాసాగర్‌ను బెదిరింపులకు గురిచేసింది. సమాజంలో తన పరువు పోతుందనే భయంతో విద్యాసాగర్ ఆమె అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ వచ్చారని సీఐడీ తన నివేదికలో స్పష్టం చేసింది.

 

రూ. 1.32 కోట్ల నగదు బదిలీ

 

ఈ బ్లాక్‌మెయిలింగ్ వ్యవహారంలో కేవలం బెదిరింపులే కాకుండా, భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సీఐడీ పక్కా ఆధారాలను సేకరించింది. కాదంబరి జత్వాని, ఆమె తల్లికి ఉన్న ఉమ్మడి బ్యాంక్ ఖాతాకు విద్యాసాగర్ విడతల వారీగా నగదు బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. మొత్తంగా రూ.1.32 కోట్లను ఆమె విద్యాసాగర్ నుంచి వసూలు చేసినట్లు బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ల ద్వారా సీఐడీ ఆధారాలతో సహా ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచింది.

 

కేసులో ఊహించని మలుపు

 

వాస్తవానికి ఈ కేసు గతంలో వేరే మలుపు తిరిగింది. నటి జత్వాని ఇచ్చిన ఫిర్యాదులు, ఆమెపై జరిగిన విచారణ తీరుపై అప్పట్లో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ఈ కేసును సరిగ్గా హ్యాండిల్ చేయలేదనే ఆరోపణలపై ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేసింది. అయితే ఇప్పుడు సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో బాధితుడిగా ఉన్న విద్యాసాగరే అసలైన నిందితురాలి చేతిలో మోసపోయాడని తేలడంతో కథ అడ్డం తిరిగింది. పక్కా సాక్ష్యాలతో సీఐడీ వేసిన ఈ ఛార్జ్‌షీట్ రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |