UPDATES  

NEWS

 ఏపీలో మళ్లీ కరోనా కలకలం..!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నాయి. తాజాగా నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో రెండు కొత్త కేసులు వెలుగులోకి రావడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

 

వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాలెంకు చెందిన మూడేళ్ల బాలుడు క్యాన్సర్ చికిత్స నిమిత్తం పుదుచ్చేరిలో ఉండగా, అతనికి కరోనా సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, బాలుడి కుటుంబ సభ్యులకు, సమీప బంధువులకు నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ అని తేలింది.

 

మరోవైపు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం రోలపాడుకు చెందిన 13 ఏళ్ల బాలిక కిడ్నీ సంబంధిత సమస్యలతో విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో డయాలసిస్ చేయించుకుంటోంది. జ్వరం, ఇతర లక్షణాలు కనిపించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించగా, ఆమెకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో బాలికను వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఆమె కుటుంబ సభ్యులకు నిర్వహించిన పరీక్షల్లో కూడా నెగటివ్ అని నిర్ధారణ అయ్యింది.

 

రాష్ట్రవ్యాప్తంగా జూన్ 26 నుంచి జులై 16 మధ్య కాలంలో మొత్తం 12 కోవిడ్ కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదు కాగా, గుంటూరులో రెండు, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగు చూశాయి. మరణించిన వారంతా రక్తపోటు, మధుమేహం, కిడ్నీ వ్యాధుల వంటి ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారేనని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి కేసుల వ్యాప్తి తీవ్రంగా లేనందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |