UPDATES  

NEWS

 ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో కరవు..! 320 మండలాల్లో తీవ్ర దుర్భిక్షం..

ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో కరవు తీవ్రత ఆందోళనకరంగా మారింది. ప్రాథమిక అంచనాల ప్రకారం, రాష్ట్రంలోని 18 జిల్లాల్లో గల 320 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం 621 మండలాలు ఉండగా, అందులో సగానికి పైగా మండలాలు కరవు కోరల్లో చిక్కుకున్నట్లు స్పష్టమవుతోంది.

ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై తక్షణమే సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జజూ అధికారులను ఆదేశించారు. డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ సచివాలయంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రణాళిక, రెవెన్యూ, భూగర్భ జల, వ్యవసాయం, పంచాయతీ రాజ్ వంటి వివిధ శాఖల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించి, నిబంధనల ప్రకారం కరవు మండలాలను గుర్తించాలని సూచించారు. నైరుతి రుతుపవనాల (జూన్-సెప్టెంబర్) వర్షపాతంతో పాటు 12 ప్రామాణికాంశాలను పరిగణనలోకి తీసుకుని అక్టోబర్ చివరి నాటికి నివేదికను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఎల్ నినో ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించినందున, దీనికి అవసరమైన సమగ్ర సమాచారంతో మరో నివేదికను సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. కరవు పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. త్వరలో మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి, ప్రభావిత మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించి, రాష్ట్రానికి తగిన ఆర్థిక సాయం అందించాలని కోరనుంది.

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో తెలంగాణలో 17 శాతం వర్షపాతం లోటు నమోదైంది. గతంలో సుమారు 235 మండలాల్లో కరవు పరిస్థితులు ఉండవచ్చని అంచనా వేయగా, తాజా అంచనాల్లో ప్రకారం ఆ సంఖ్య 320కి పెరిగింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |