వైసీపీపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని ఆయన ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోవిందరావుతో కలిసి ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… బీసీలకు రాజ్యాధికారం దక్కకూడదనే ఉద్దేశంతోనే గతంలో వైసీపీ ప్రభుత్వం రిజర్వేషన్లను అడ్డుకుందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాపై గతంలో కోర్టు తీర్పు ఇస్తే, దానిపై అప్పటి జగన్ ప్రభుత్వం ఎందుకు పోరాడలేదని ఆయన ప్రశ్నించారు. బీసీలకు వైసీపీ తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం సుప్రీంకోర్టులో పోరాటం చేస్తోందని తెలిపారు. గతంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిందే తెలుగుదేశం పార్టీ అని గుర్తుచేశారు. బీసీలు ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే టీడీపీ లక్ష్యమని స్పష్టం చేశారు. టీడీపీకి బీసీలే వెన్నెముక అని, తమది బీసీల పార్టీ అని అన్నారు. జగన్ అండ్ కో ఆటలు ఇకపై చెల్లవని హెచ్చరించారు.









