UPDATES  

NEWS

 అమరావతి ఓఆర్‌ఆర్‌కు టెండర్లు.. రూ.11,537 కోట్లతో పనులు..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాల చుట్టూ నిర్మించ తలపెట్టిన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఈ భారీ ప్రాజెక్టు పనుల కోసం నాలుగు ప్యాకేజీలుగా టెండర్లను ఆహ్వానించింది. మొత్తం రూ.11,537.70 కోట్ల అంచనా వ్యయంతో సివిల్ పనులను చేపట్టనున్నారు.

శుక్రవారం నుంచి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 195.13 కిలోమీటర్ల పొడవున ఈ రహదారిని నిర్మించనున్నారు. ఇందులో 189.93 కి.మీ. ఆరు వరుసల ఓఆర్‌ఆర్‌ కాగా, నారాకోడూరు నుంచి బుడంపాడు వరకు 5.2 కి.మీ. నాలుగు వరుసల అనుసంధాన రహదారి కూడా ఉంది. నవంబర్ 18 వరకు బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించగా, 19న టెక్నికల్ బిడ్లను తెరవనున్నారు. కేంద్ర కమిటీల నుంచి తుది అనుమతులు త్వరలో రానున్నాయన్న అంచనాతో ఎన్‌హెచ్‌ఏఐ ముందుగానే టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టింది.

ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) పద్ధతిలో చేపట్టనున్నారు. దీని ప్రకారం, నిర్మాణ సమయంలో కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థకు ప్రభుత్వం 40 శాతం నిధులు చెల్లిస్తుంది. మిగిలిన 60 శాతం మొత్తాన్ని కాంట్రాక్టర్ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వం వడ్డీతో పాటు 10-15 ఏళ్లలో తిరిగి చెల్లిస్తుంది. ప్రతి ప్యాకేజీని మూడేళ్లలో పూర్తి చేయాలని టెండర్లలో పేర్కొన్నారు.

ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 97 గ్రామాల మీదుగా ఈ ఓఆర్‌ఆర్ వెళ్తుంది. దీని నిర్మాణంలో భాగంగా కృష్ణా నదిపై రెండు భారీ వంతెనలు, మూడు సొరంగాలు, అనేక అండర్‌పాస్‌లు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి, ఓడరేవులు, విమానాశ్రయానికి అనుసంధానం మెరుగుపడి ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |