UPDATES  

NEWS

 ఏఐ వీడియో కలకలం.. అంబటి రాంబాబుపై సీఐడీ కేసు నమోదు..

కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన AI వీడియో వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో తీవ్ర దుమారం రేపుతోంది. వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వివాదాస్పద వీడియోను పోస్ట్ చేశారని ఆరోపిస్తూ అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

 

డీజీపీ కార్యాలయంలో టీడీపీ నేతల ఫిర్యాదు

 

మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల మ్యానీ నేతృత్వంలోని టీడీపీ బృందం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఈ వ్యవహారంపై రాతపూర్వక ఫిర్యాదు అందించింది. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతిష్టను దిగజార్చేలా, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ఉద్దేశంతోనే ఈ ఏఐ టెక్నాలజీ ఆధారిత వీడియోను సృష్టించి ప్రచారం చేశారని వారు తమ ఫిర్యాదులో స్పష్టం చేశారు. నాయకుల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న ఈ తరహా పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

రంగంలోకి సీఐడీ.. దర్యాప్తు ప్రారంభం

 

మద్దిరాల మ్యానీ ఇచ్చిన ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించిన సీఐడీ అధికారులు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అధికారికంగా కేసు నమోదు చేశారు. ఈ వీడియోను ఎవరు తయారు చేశారు, దీని వెనుక ఉన్న సాంకేతిక సహకారం ఎవరిది, ఏ ఉద్దేశంతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మున్ముందు ఈ కేసులో డిజిటల్ ఆధారాలను సేకరించి మరిన్ని చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |