UPDATES  

NEWS

 అమరావతిలో కుంకీ ఏనుగులకు పవన్ కల్యాణ్ ఘన స్వాగతం..!

పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల సరిహద్దుల్లోని గ్రామాలు, పంటపొలాలపై దాడి చేస్తూ ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్న అడవి ఏనుగుల గుంపును కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరులోని ముసలి మడుగు ఏనుగుల క్యాంపు నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన రెండు కుంకీ ఏనుగులు ‘అభిమన్యు’, ‘జయంత్’ మన్యం జిల్లాకు బయలుదేరాయి. మంగళగిరిలోని డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఈ కుంకీ ఏనుగులకు ఆయన స్వయంగా ఘన స్వాగతం పలికారు.

 

పూలమాలలు, చెరకు గెడలతో ప్రత్యేక స్వాగతం

మంగళగిరికి చేరుకున్న కుంకీ ఏనుగులకు పవన్ కల్యాణ్ పూలమాలలు వేసి, పసుపు-కుంకుమలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం వాటికి చెరకు గెడలు, అరటిపండ్లు, ఇతర పౌష్టికాహారాన్ని తన చేతుల మీదుగా అందించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని ‘గుచ్చిమి’ క్యాంపునకు తరలిస్తున్న ఈ ఏనుగులు, అక్కడి నుంచి అడవి ఏనుగుల సంచార ప్రాంతాల్లో మోహరించనున్నాయి. ఆపరేషన్ ప్రారంభించబోయే ముందు వాటి సంక్షేమం, ప్రయాణ సౌకర్యాలను డిప్యూటీ సీఎం దగ్గరుండి పరిశీలించారు.

అనుభవజ్ఞులైన ‘అభిమన్యు, జయంత్’.. రంగంలోకి స్పెషల్ టీమ్

ఈ రెండు కుంకీ ఏనుగులకు గతంలోనూ జనావాసాల్లోకి వచ్చే అడవి ఏనుగులను సురక్షితంగా అడవుల్లోకి మళ్లించిన సుదీర్ఘ అనుభవం ఉంది. ప్రత్యేకించి మొండికేసే ఏనుగులను శాంతింపజేయడంలో, వాటిని నియంత్రించడంలో ఇవి దిట్ట. పలమనేరు నిపుణులైన మావటీలు, అటవీశాఖ ప్రత్యేక బృందాల పర్యవేక్షణలో ఇవి గుచ్చిమి క్యాంపు నుంచి తమ ఆపరేషన్‌ను మొదలుపెడతాయి. ఏనుగుల వల్ల పంటలు, ప్రాణనష్టం జరుగుతుందనే ఆందోళనలో ఉన్న మన్యం జిల్లా ప్రజలకు ఈ కుంకీల రాక పెద్ద ఊరటనిచ్చింది.

 

ఒడిశా ప్రభుత్వంతో చర్చలు.. సుదీర్ఘ పరిష్కారం వైపు అడుగులు

ముఖ్యంగా ఒడిశా సరిహద్దుల నుంచే ఏనుగుల గుంపులు ఏపీ సరిహద్దు జిల్లాల్లోకి ప్రవేశించి ధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ తీవ్ర సమస్యపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఒడిశా ఉన్నతాధికారులు, అటవీశాఖతో సమన్వయం చేసుకొని సంయుక్త ఆపరేషన్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఒడిశా నుంచి కూడా కొన్ని అధునాతన శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను రప్పించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని సూచించారు. ఈలోగా మన దగ్గరున్న కుంకీల సహాయంతో అడవి ఏనుగులను దారిమళ్లించి, ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాలను అరికట్టాలని ఆదేశించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |