రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు.
సియోల్‌లో ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ యున్-జు కోహ్‍తో లోకేశ్ భేటీ అయ్యారు. కాకినాడ పోర్టు సమీపంలో పాలీస్టైరిన్ తయారీ కేంద్రాన్ని, మూలపేటలో ప్రపంచస్థాయి నాఫ్తా క్రాకర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. అలాగే, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గ్లోబల్ సీఈవో ల్యూ జె చెయోల్‌తో సమావేశమై… విశాఖపట్నంలో ఒక ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం హ్యుందాయ్ మోబిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ బిన్ కిమ్‌తో సమావేశమైన లోకేశ్, ఏపీలో ఈవీ సెమీకండక్టర్స్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులతో భేటీ సందర్భంగా… ఏపీని డేటా సెంటర్లు, సర్వర్ తయారీకి భారతదేశపు స్థావరంగా మార్చాలని ప్రతిపాదించారు.
ఈ సందర్భంగా క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడమే తమ లక్ష్యమని లోకేశ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 150 క్యూబిట్‌ల క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు నుంచి, దాని తయారీ వరకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఈ బిజీ షెడ్యూల్ మధ్య ఆయన ఎల్జీ సైన్స్ పార్క్ లో రోబోతో ఫొటో దిగారు.









