UPDATES  

NEWS

 జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు..?

ఈ ఏడాది చివరలోనే జీహెచ్ఎంసీతో పాటు కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని సర్కారు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికలకు సిధ్ధం కావాలని ఇప్పటికే జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడిన రెండు మున్సిపల్ కార్పొరేషన్లకు సర్కారు సిద్దం కావాలని ఆదేశిస్తూ సంకేతాలిచ్చినట్లు అధికారవర్గాల విశ్వసనీయ సమాచారం. దీంతో మూడు కార్పొరేషన్లు కూడా ఎన్నికలకు సిద్దమవుతున్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీలో 2020 డిసెంబర్ లో కొలువుదీరిన పాలక మండలి గత ఫిబ్రవరి 10వ తేదీన అధికార కాలం గడువు ముగించుకున్న సంగతి తెల్సిందే.

 

వార్డులు పెంచాలని నిర్ణయం..

పాలక మండలి గడువు ముగిసిన మరుసటి రోజైన ఫిబ్రవరి 11న విస్తరించిన జీహెచ్ఎంసీ పరిధిని 300 వార్డులతో మూడు కార్పొరేషన్లుగా సర్కారు ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. మూడింటిలో అతి పెద్ద కార్పొరేషన్ గా ఏర్పడిన జీహెచ్ఎంసీలోని 150 మున్సిపల్ వార్డులకు అధికారులు త్వరలోనే రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉండగా, సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని మరో 150 మున్సిపల్ వార్డులను 200 లకు పెంచాలని కూడా సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం ఓ ఉన్నతాధికారి కసరత్తు కూడా చేస్తున్నట్లు తెలిసింది. కానీ కొత్తగా ఏర్పడిన రెండు మున్సిపల్ కార్పొరేషన్లలోని వార్డులను పునర్విభజించిన తర్వాత జీహెచ్ఎంసీతో పాటు మూడు కార్పొరేషన్ల మేయర్ పీఠంతో పాటు మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లను కూడా ఖరారు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసిందే.

 

వార్డుల రిజర్వేషన్లు..

కానీ గత సంవత్సరం నవంబర్ 25వ తేదీన కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసిన తర్వాత విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత పెరిగిన పరిధిని 45 వేల జనాభా ప్రాతిపాదికన, పది శాతం ఎక్కువగాను, తక్కువగాను మొత్తం 300 మున్సిపల్ వార్డులుగా విభజించిన సంగతి తెల్సిందే. వార్డుల పునర్విభజన సమయంలోనే అధికారులు వార్డుల రిజర్వేషన్లకు సంబంధించి పనిలో పనిగా ప్రాథమిక కసరత్తు కూడా నిర్వహించినట్లు తెలిసింది. ఇదెలా ఉండగా, 2023 డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రెండున్నరేళ్ల కాలం పూర్తి చేసుకున్నందున, వచ్చే సంవత్సరం నుంచి ఏడాదిన్నర కాలం పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టనున్నందున, ఈ ఏడాది చివరలో మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించి, ఆ ఫలితాలను బట్టి అసెంబ్లీ ఎన్నికలకు స్కెచ్ సిద్దం చేసుకోవాలని సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది.

 

శివార్లలో ఆశావాహుల ప్రయత్నాలు

పట్టణ స్థానిక సంస్థల విలీనానంతరం జీహెచ్ఎంసీ పరిధి పెరగటం, పాలక మండలి గడువు ముగిసిన మరుసటి రోజే పెరిగిన పరిధిని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించిన నాటి నుంచే మున్సిపల్ ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని శివార్లలో వివిధ పార్టీలకు చెందిన ఆశావాహులు టికెట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నట్లు తెలిసింది. మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లకు సంబంధించి ప్రధాన పార్టీలకు చెందిన ఆశావాహులు ఎవరికి వారే లెక్కలేసుకుని రిజర్వేషన్లపై అంచనాలు వేసుకుంటూ టికెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ముఖ్యంగా జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్లలో విలీనమైన పట్టణ స్థానిక సంస్థల్లో ఈ ఆశావాహుల సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలిసింది. మూడు కార్పొరేషన్లలో కొత్తగా ఏర్పడిన వార్డుల్లో ఇప్పటికే ఆశావాహులు తమ సామాజికవర్గానికి చెందిన నేతలు, ఓటర్లతో సన్నిహితంగా వ్యవహారిస్తూ లైన్ క్లియర్ చేసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం.

 

ఎంఎంసీలో ఆశావాహుల దరఖాస్తులను స్వీకరిస్తున్న ఎంఐఎం

మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేయాలని భావిస్తున్న ఆశావాహుల నుంచి ఆ పార్టీ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిసింది. మున్సిపల్ వార్డుల వారీగా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే సీఎంసీ, జీహెచ్ఎంసీ పరిధిలో కూడా టికెట్ ఆశించే వారి నుంచి దరఖాస్తులను స్వీకరించాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |