UPDATES  

NEWS

 పెరంబూర్‌కే విజయ్ ఓటు.. తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా..

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ ఇవాళ తిరుచ్చి (ఈస్ట్) అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలిచిన ఆయన, పెరంబూర్ నియోజకవర్గాన్ని నిలుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ సెక్రటేరియట్ ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

 

ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ స్థానాల నుంచి పోటీ చేసి రెండింటిలోనూ ఘన విజయం సాధించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, రెండుచోట్ల గెలిచిన అభ్యర్థులు ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన మేరకే విజయ్ తిరుచ్చి ఈస్ట్‌ను వదులుకుని, పెరంబూర్‌కు ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత తర్వాత, తమిళనాడులో ఏకకాలంలో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచిన నేతగా విజయ్ నిలిచారు.

 

ఇదిలా ఉండగా, కొత్తగా ఎన్నికైన 17వ తమిళనాడు అసెంబ్లీ తొలి సమావేశం సోమవారం (మే 11) ఉదయం 9.30 గంటలకు జరగనుంది. కొత్త ఎమ్మెల్యేలందరూ తమ ఎన్నికల ధృవీకరణ పత్రాలతో హాజరుకావాలని అసెంబ్లీ కార్యదర్శి కోరారు. మే 12న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

 

నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. తనది సామాన్యుడి ప్రభుత్వమని, సామాజిక న్యాయమే లక్ష్యమని ఆయన తన తొలి ప్రసంగంలో స్పష్టం చేశారు.

 

కాగా, విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి వీసీకే పార్టీ అధినేత థోళ్ తిరుమావళవన్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టీవీకే పార్టీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రావడంలో వీసీకే పార్టీ సహకారం కూడా ఉంది. ఆ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యే ఉన్నారు. టీవీకే పార్టీకి మద్దతు ప్రకటిస్తూ నిన్న వీసీకే లేఖ ఇవ్వడంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |