UPDATES  

NEWS

 కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట..! శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం..!

కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. కాంగ్రెస్ అసమర్థ పాలన, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం, అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ చేపట్టనున్న వారం రోజుల ప్రత్యేక కార్యాచరణను విజయవంతం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2 నుంచి ఏడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

శుక్రవారం పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వారం రోజుల కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులు దాటినా ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ వైఖరిని ప్రజల ముందు ఎండగట్టాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పై ఉందని పేర్కొన్నారు.

పార్టీ నిర్ణయించిన కార్యాచరణను కేవలం కార్యక్రమాలకే పరిమితం చేయకుండా కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏంటి? వాటిలో ఎన్ని అమలయ్యాయి? ప్రజలకు ఇంకా ఏమేం బాకీ ఉన్నాయి? అనే అంశాలను ప్రతి ఇంటికీ చేరేలా వివరించాలని కేటీఆర్ సూచించారు. ప్రతి నాయకుడు తన కార్యక్షేత్రంలో బాధ్యత తీసుకొని ప్రజలతో మమేకమవుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

ప్రజలకు ప్రభుత్వం ఇంకా బాకీ ఉన్న హామీలను తెలియజేసేలా ప్రత్యేక బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌తో పాటు అర్బన్ ప్రాంతాల్లో ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న 22ఏ నిషేధిత జాబితా భూముల సమస్యపై ప్రత్యేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వారం రోజుల కార్యచరణలో ఒక్కో రోజు ఒక్కో సమస్యను నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. అమలు కాని హామీలు, రాష్ట్ర సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని కేటీఆర్ పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |