బీఆర్ఎస్ నేత హరీశ్ రావు హైటెక్ అవినీతికి పాల్పడ్డారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్స్ వేదికగా ఆరోపించారు. వైద్య శాఖ మంత్రిగా ఆసుపత్రులతో వ్యాపారం చేశాడన్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఆసుపత్రులతో వ్యాపారం చేయడం, అది కూడా ఊరూ పేరూ లేని కంపెనీ పేరుతో జరగడం వెనుక అధికార దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హరీశ్ రావు ఆర్థిక ఆరోగ్యం ఊహించనంతగా మెరుగుపడిందని మంత్రి విమర్శించారు. గతంలో రబ్బరు చెప్పులు వేసుకుని తిరిగిన వ్యక్తి.. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఎన్నికల ఖర్చు భరించేంత స్థాయికి ఎదిగాడని ఆరోపించారు. పాల కంపెనీ.. హరీశ్ రావు అవినీతి సామ్రాజ్యంలో ఒక చిన్న ఉదాహరణ మాత్రమేనని అన్నారు. ఆ అవినీతి సామ్రాజ్యాన్ని తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయన్నారు.
ఎలాంటి తప్పు చేయకపోతే ఆ కంపెనీ వెబ్ సైట్ ను ఎందుకు మూశారని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. ఓట్ల కోసం ప్రజలను రెచ్చకొట్టడం హరీష్ రావుకు మొదట్నుంచీ అలవాటేనని చెప్పారు.









