UPDATES  

NEWS

 ఏపీలో స్థానిక ఎన్నికలంటూ ప్రచారం.. ఎస్ఈసీ హెచ్చరిక..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ అంటూ సోషల్ మీడియా, వాట్సాప్‌లలో విస్తృతంగా ప్రచారమవుతున్న సమాచారం పూర్తిగా అవాస్తవమని, నకిలీదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. ఈ ఫేక్ షెడ్యూల్‌ను ప్రజలు నమ్మవద్దని, ఇతరులకు ఫార్వార్డ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే వారిపై కఠినమైన సైబర్ చట్టాల కింద చర్యలు తీసుకుంటామని సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా హెచ్చరించారు.

ఎన్నికల కమిషన్ అధికారిక చిహ్నాలు, లోగోలను దుర్వినియోగం చేసి కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ నకిలీ షెడ్యూల్‌ను సృష్టించి ప్రచారం చేస్తున్నారని పునేఠా తెలిపారు. ఈ షెడ్యూల్‌పై స్పష్టత కోరుతూ తమ కార్యాలయానికి అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా అధికారిక పత్రికా ప్రకటనల ద్వారా లేదా మీడియా సమావేశాల ద్వారా మాత్రమే వెల్లడిస్తామని, ప్రజలు అనధికారిక వార్తలను ఏమాత్రం పట్టించుకోవద్దని సూచించారు. ఖచ్చితమైన సమాచారం కోసం ఎస్‌ఈసీ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించాలని కోరారు.

మరోవైపు, రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆగస్టు 19న జీవో జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 100 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉండటం వల్ల మరో 23 మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. త్వరలోనే అధికారికంగా షెడ్యూల్ విడుదల చేస్తామని, అప్పటివరకు వదంతులను నమ్మవద్దని అధికారులు స్పష్టం చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |