అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్పై టిడిపీ అధిష్టానం ఆగ్రహించింది. తనపై సొంత పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్రెడ్డి తీవ్ర ఆరోపణల నేపథ్యంలో దగ్గుపాటి కౌంటర్ ఇవ్వాలని భావించారు. ఈ విషయమై అధిష్టానానికి సమాచారం ఇచ్చి, వైకుంఠం ప్రభాకర్ చౌదరిపై తీవ్రస్థాయిలో ఎదురు దాడి చేయాలని ఎమ్మెల్యే అనుకున్నారు.
అయితే వైకుంఠం ప్రభాకర్ చౌదరి తన పార్టీ ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్రంగా కుదిపేశాయి. ఔను, ఆయన ఆరోపణలన్నీ నిజమే అన్న పాజిటివ్ టాక్ వినిపించింది. ఒకవేళ దగ్గుపాటి తిరిగి తనపై ఆరోపణలు చేస్తే, మరిన్ని ఆధారాలతో కూడిన ఆరోపణలు చేయడానికి ప్రభాకర్ చౌదరి సిద్ధమైనట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే అనంతపురంలో పార్టీని భ్రష్టు పట్టించారని, ఇక చాలు అని దగ్గుపాటిపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో ప్రభాకర్ చౌదరిపై దగ్గుపాటి కారాలుమిరియాలు నూరుతున్నట్టుగా సమాచారం.
వైసీపీ నేతలతో అవగాహనకు వచ్చి, ఉద్దేశ పూర్వకంగానే తనను ప్రభాకర్ చౌదరి బద్నాం చేస్తున్నాడని సన్నిహితుల వద్ద దగ్గుపాటి వాపోతున్నారని తెలిసింది. పార్టీ అధిష్టానం అనుమతిస్తే, ప్రభాకర్ చౌదరిపై విరుచుకుపడదామని అనుకుంటుంటే, వీలు కావడం లేదని దగ్గుపాటి అసహనంగా ఉన్నారు. అనంతపురంలో కొంతకాలంగా దగ్గుపాటిపై తీవ్ర ఆరోపణలు రావడం, వాటికి బలం కలిగించేలా వైకుంఠం ప్రభాకర్ చౌదరి కామెంట్స్ ఉన్నాయనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.









