UPDATES  

NEWS

 డీఎస్సీపై చర్చకు రా.. టైమ్, డేట్ నీ ఇష్టం..! జగన్‌కు నారా లోకేశ్ ఐదోసారి సవాల్..

డీఎస్సీ నియామకాలపై చర్చకు రావాలంటూ వైసీపీ అధినేత జగన్‌ కు తాను ఐదోసారి సవాల్ విసురుతున్నానని, దమ్ముంటే చర్చకు రావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. “టైమ్, డేట్ నువ్వే ఫిక్స్ చెయ్.. డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చోవడం కాదు, బయటకు రా!” అని లోకేశ్ తీవ్ర స్వరంతో జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శనివారం విజయనగరం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీకి మధ్య తేడా కూడా తెలియని వ్యక్తి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారని ఆయన ఎద్దేవా చేశారు.

“ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయని జగన్, ఇప్పుడు మేం పారదర్శకంగా భర్తీ చేసిన 16 వేల ఉద్యోగాలపై దుష్ప్రచారం చేస్తున్నారు. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లు అంటే కూడా ఆయనకు అవగాహన లేదు. అసెంబ్లీలో వారి ఆరోపణలకు సమాధానం చెప్పినా, బయటకు వచ్చి మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కష్టపడి టెట్, డీఎస్సీ రాసి ఎంపికైన ఉపాధ్యాయులను అవమానించడం మానుకోవాలి” అని లోకేశ్ హితవు పలికారు. జగన్ చెప్పే అబద్ధాలను కార్యకర్తలు బలంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

కార్యకర్తలే పార్టీకి బలం
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, వారి త్యాగాల పునాదులపైనే పార్టీ నిలబడి ఉందని స్పష్టం చేశారు. “కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది. కార్యకర్తలు నన్ను వెతుక్కుంటూ రావాల్సిన పనిలేదు. కష్టపడే వారిని నేనే వెతుక్కుంటూ వస్తాను” అని ఆయన భరోసా ఇచ్చారు. కార్యకర్తల సంక్షేమం కోసం రూ.160 కోట్లు ఖర్చు చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను న్యాయబద్ధంగా తొలగిస్తామని, ఇప్పటికే 75 శాతం కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న నీరు-చెట్టు బిల్లుల సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు కూటమికి అఖండ విజయాన్ని అందించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని లోకేశ్ అన్నారు. “భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, రైల్వే జోన్ ఏర్పాటు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీలను ఉత్తరాంధ్రకు తీసుకువచ్చి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం” అని హామీ ఇచ్చారు. అయితే, వైసీపీ ఎంపీ గురుమూర్తి కాగ్నిజెంట్ సంస్థకు భూ కేటాయింపును అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించడం వారి అభివృద్ధి నిరోధక వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

అదితి గజపతిరాజుపై ప్రశంసలు
విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం తపిస్తారని లోకేశ్ ప్రశంసించారు. “అసెంబ్లీలో అదితి గారు రోజుకు మూడుసార్లైనా నా వద్దకు వచ్చి నియోజకవర్గ సమస్యల గురించే మాట్లాడతారు. జీఎంఆర్-మాన్సాస్ ఎడ్యూసిటీ కోసం గజపతి రాజుల కుటుంబం 150 ఎకరాలు ఉచితంగా ఇవ్వడం వారి దాతృత్వానికి నిదర్శనం” అని కొనియాడారు. సీనియర్ నేత అశోక్ గజపతిరాజు గురించి మాట్లాడుతూ, “ఆయన నానో కారులో తిరిగినా, ఆయన రాజసం రోల్స్ రాయిస్ లాంటిది. గత ప్రభుత్వం ఆయనను ఎన్నో ఇబ్బందులు పెట్టింది. ఎన్ని కేసులు పెట్టినా మా నాయకులకు బలమే కానీ బలహీనత కాదు” అని వ్యాఖ్యానించారు.

రప్ప రప్ప బ్యాచ్‌కు నో ఎంట్రీ.. స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి
వైసీపీ నుంచి టీడీపీలోకి రావాలనుకునే వారికి పార్టీలో స్థానం లేదని లోకేశ్ తేల్చిచెప్పారు. “రప్ప రప్ప అంటే చూస్తూ ఊరుకోం. చట్టాన్ని ఉల్లంఘిస్తే బొక్కలో వేసే బాధ్యత నాది. రెడ్ బుక్ దాని పని అది చేసుకుపోతుంది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి ఇక్కడ హౌస్‌ఫుల్ బోర్డు పెట్టేశాం” అని హెచ్చరించారు. 

త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సూచించారు. పంచాయతీ నుంచి ఢిల్లీ వరకు కూటమి ప్రభుత్వాలు ఉంటేనే అభివృద్ధి వేగవంతం అవుతుందని, కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేసి అద్భుత విజయాలు సాధించాలని కోరారు. అనంతరం, సమావేశానికి హాజరైన ప్రతి కార్యకర్తతో ఆయన ఫొటో దిగారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |