UPDATES  

NEWS

 ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు సులభతరం…. అసెంబ్లీలో సవరణ బిల్లు ప్రవేశపెట్టిన లోకేశ్‌..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు ప్రక్రియను సరళతరం  చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ మేరకు ‘ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026’ను విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. నిబంధనలను సరళతరం చేసి, ఉన్నత విద్యా రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తిగా తీసుకొచ్చిన ‘జన్ విశ్వాస్’ విధానంలో భాగంగానే ఈ సవరణలు చేస్తున్నట్లు మంత్రి లోకేశ్‌ వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను అన్ని రంగాలకు విస్తరింపజేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఉన్నత విద్యా రంగంలో నియంత్రణలను సులభతరం చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో వర్సిటీల సంఖ్య తక్కువగా ఉందని, ఈ సవరణల ద్వారా కొత్త సంస్థలను ప్రోత్సహించవచ్చని తెలిపారు.

ఈ బిల్లులో పలు కీలక సవరణలు ప్రతిపాదించారు. ప్రధానంగా, ప్రైవేటు వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని 50 ఎకరాల నుంచి సీఆర్డీఏ, విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో 10 ఎకరాలకు, ఇతర ప్రాంతాల్లో 15 ఎకరాలకు తగ్గించారు. కనీస పెట్టుబడి నిబంధనను పూర్తిగా తొలగించి, కేసును బట్టి నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకునేలా మార్పు చేశారు. ఎండోమెంట్ ఫీజును రూ.5 కోట్లకు పరిమితం చేశారు. బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీగా మారాలంటే యూజీసీ నిబంధనల ప్రకారం కనీసం 3.01 సీజీపీఏ తప్పనిసరి చేశారు.

ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలో రెండో మహిళా విశ్వవిద్యాలయంగా ‘విష్ణు మహిళా విశ్వవిద్యాలయం’ ఏర్పాటుకు మార్గం సుగమమైందని మంత్రి తెలిపారు. మా ప్రభుత్వ విధానం ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అని, దరఖాస్తుల ప్రక్రియను 60 రోజుల్లో పూర్తి చేసేలా ఫాస్ట్ ట్రాక్ విధానాన్ని ఆన్‌లైన్‌లో తీసుకొస్తున్నామన్నారు.

రాష్ట్రంలో ఏర్పాటు కానున్న స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ వంటి 22 పారిశ్రామిక క్లస్టర్లకు అనుగుణంగా వర్సిటీలలో పరిశోధనలను ప్రోత్సహించడమే లక్ష్యమని లోకేశ్‌ పేర్కొన్నారు. నాణ్యతలో రాజీ పడకుండా, పరిశ్రమలకు అనుసంధానంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే ఈ సవరణల ముఖ్య ఉద్దేశమని మంత్రి వివరించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |