UPDATES  

NEWS

 రేషన్ కార్డులపై మోదీ ఫొటో పెట్టండి.. లేదంటే ప్రజా ఉద్యమమే.. రఘునందన్ రావు వార్నింగ్..!

తెలంగాణలో ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్న నేపథ్యంలో బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. రేషన్ కార్డుపై ప్రధాని మోదీ ఫొటో పెట్టాలని ఆయన పట్టుబట్టారు. స్మార్ట్ కార్డులపై సీఎం రేవంత్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఫొటోలు ఉండటాన్ని ఆయన తప్పుబట్టారు. ఒక్కో మనిషికి ఇచ్చే 6 కిలోల ఉచిత బియ్యమే కేంద్రమే 5 కేజీలు ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం ప్రభుత్వం ఒక్క కిలో బియ్యం ఇస్తూ కార్డుపై కాంగ్రెస్ నేతల ఫొటోలు ఎందుకని నిలదీశారు.

కేంద్రం ఇస్తున్న 5 కిలోల బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం గుర్తింపు ఇవ్వడం లేదని ఈ సందర్భంగా రఘునందన్ రావు ఆక్షేపించారు. కార్డుపై మోదీ ఫొటో పెట్టకపోవడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. 1.06 కోట్ల కార్డుల పంపిణీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టారు. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 90 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయన్న మెదక్ ఎంపీ.. కొత్తగా ఎన్ని కార్డులు ఇస్తున్నారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. రేషన్‌ కార్డుల ముద్రణ ఖర్చులు, టెండర్ల వివరాలు బయటపెట్టాలని కోరారు.

మరోవైపు రేషన్‌ డీలర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయాలని రఘునందన్ రావు అన్నారు. రేషన్‌ డీలర్లకు గౌరవ వేతనం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పెంచిన రేషన్‌ డీలర్ల కమిషన్‌ను వెంటనే ఇవ్వాలని కోరారు. రేషన్‌ బియ్యంలో నూకలు ఎక్కువగా ఉన్నాయన్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో రాష్ట్రంలోని పేదలకు మరిన్ని నిత్యావసర సరుకులు అందించాలని పట్టుబట్టారు. కర్ణాటక తరహాలో కందిపప్పు, నూనె, రాగులు, చక్కెర, గోధుమలు ఇవ్వాలని కోరారు.

సన్నం బియ్యం వద్దనుకునే వారికి ప్రత్యామ్నాయ ఆహార ధాన్యాలు ఇవ్వాలని ప్రభుత్వానికి రఘునందన్ రావు విజ్ఞప్తి చేశారు. పేదల ఆహార భద్రతపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలన్నారు. రేషన్‌ కార్డుల పంపిణీని పునఃపరిశీలించి.. మోదీ ఫొటోతో కొత్త కార్డులు ముద్రించాలని ఆయన పునరుద్ఘటించారు. డిమాండ్‌ నెరవేర్చకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సంగారెడ్డిలో రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలోనే దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మెదక్ ఎంపీ డిమాండ్ చేశారు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |