UPDATES  

NEWS

 కేసీఆర్‌కు మళ్లీ సమన్లు జారీ..!

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసులో తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరిగింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు బుధవారం మరోసారి నోటీసులు జారీ చేయడంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది.

గతంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంతో, నిర్మాణంలో నాణ్యతా లోపాలు, అక్రమాలు జరిగాయంటూ భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి కోర్టులో పిటిషన్ వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దీనిపై విచారణ కమిషన్ కూడా వేసింది. అయితే, పిటిషనర్ రాజలింగమూర్తి ఇటీవల మరణించారు. అయినప్పటికీ, ఇది ప్రజాధనానికి సంబంధించిన అంశం కాబట్టి విచారణను నిలిపివేయకుండా ముందుకు తీసుకెళ్లాలని, వివాదాన్ని జిల్లా కోర్టు పరిధిలోనే తేల్చాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కోర్టు గతంలో కేసీఆర్‌కు సమన్లు జారీ చేసింది. అయితే, ఆ నోటీసులు ఆయనకు సరిగ్గా అందలేదని తేలడంతో, ఈసారి పక్కాగా అందజేయాలని న్యాయస్థానం జిల్లా న్యాయవాదిని ఆదేశిస్తూ మళ్లీ సమన్లు ఇచ్చింది. ఈ క్రమంలోనే అధికారులు హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు.

బుధవార విచారణ సమయంలో కోర్టు ఏదైనా తుది నిర్ణయం వెలువరించే అవకాశం ఉందనే ప్రచారంతో కోర్టు వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ప్రతినిధులు, మాజీ మంత్రి హరీశ్‌రావు తరఫు న్యాయవాదులు హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయమూర్తి, తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |