UPDATES  

NEWS

 ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్..! ఆర్థిక భారంపై కీలక వాఖ్యలు..

రాష్ట్రంలో ఉచిత పథకాల అమలు, వాటి ఆర్థిక భారంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ధర్మాసనం… చట్టబద్ధమైన ప్రక్రియ, అసెంబ్లీ తీర్మానం లేకుండా కేవలం జీవోల ఆధారంగానే ప్రజాధనాన్ని వెచ్చించే పథకాలను ఎలా కొనసాగిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నాలుగు వారాలు గడిచినా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ పథకాల అమలుపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు మధ్యంతర ‘స్టే’ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర బడ్జెట్ అంచనాలు, రాబడిని విశ్లేషిస్తూ ఆదాయంలో మెజారిటీ భాగం జీతాలు, అప్పులు, సంక్షేమ పథకాలకే సరిపోతే అభివృద్ధికి కేవలం కొన్ని వేల కోట్లు మాత్రమే మిగులుతున్నాయని న్యాయస్థానం గుర్తుచేసింది. అర్హులైన పేదలకు సహాయం చేయడం సమంజసమే అయినా, శ్రీమంతులకు కూడా ఉచితాలు అందజేస్తుండటం ఆర్థిక వ్యవస్థను డేంజర్ జోన్‌లోకి నెడుతోందని వ్యాఖ్యానించింది.

పల్సర్ బైక్, ఐఫోన్ పట్టుకుని ఉచిత బియ్యం తీసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయని.. ఫలితంగా ఇక్కడి ప్రజలు పని కల్చర్ మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. వ్యవసాయ పనులకు కూలీలు దొరక్క ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తెచ్చుకోవాల్సి వస్తోందని, ఇలాగే ఉంటే భవిష్యత్తులో ‘ఒకప్పుడు మనుషులు పని చేసేవారట’ అని మ్యూజియంలో ప్రదర్శనగా పెట్టాల్సి వస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

రాజకీయాల కోసం ఒక్క తెల్ల రేషన్ కార్డును కూడా తొలగించే ధైర్యం చేయడం లేదని, ఐఫోన్లు, ఐప్యాడ్లు పట్టుకున్న వారూ ఉచితాల కోసం చూస్తున్నారని తెలిపింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎంతటి కుబేరుడైనా డబ్బులన్నీ అయిపోయి చివరికి పనికి ఆహార పథకం కూలీగా మారక తప్పదని, రేపటి తరం భవిష్యత్తు అత్యంత ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |