UPDATES  

NEWS

 ఉప్పాడ తీరానికి రక్షణ కవచం.. పవన్ సమక్షంలో మద్రాస్‌ ఐఐటీతో ఒప్పందం..

కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న సముద్ర కోత సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. తీవ్రమైన కోత కారణంగా దెబ్బతింటున్న ఈ తీరాన్ని పరిరక్షించేందుకు ప్రతిష్ఠాత్మక ఐఐటీ మద్రాస్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో బుధవారం మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

ఈ ప్రాజెక్టు కింద రూ.323 కోట్ల వ్యయంతో ఉప్పాడ తీరంలో రక్షణ గోడ నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి (ఎన్డీఎంఎఫ్) ఆమోదంతో చేపట్టనున్న ఈ పనులకు ఐఐటీ మద్రాస్ సాంకేతిక సారథ్యం వహించనుంది. రక్షణ గోడకు అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) రూపకల్పనతో పాటు, నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యతలను కూడా ఐఐటీ నిపుణులే చూడనున్నారు.

ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్డీఎంఏ) నోడల్ ఏజెన్సీగా, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా వ్యవహరించనున్నాయి. తీర కోత తీవ్రత, సముద్రపు నీటి ప్రవాహాలు, అలల ప్రభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి, ఉప్పాడ తీరానికి అత్యంత అనువైన, పటిష్ఠమైన రక్షణ చర్యలను ఐఐటీ బృందం సూచించనుంది.

ఈ ఒప్పందంతో ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రక్రియ పూర్తయినందున, వచ్చే నవంబర్ నుంచి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలు, మత్స్యకారుల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమని అధికారులు భావిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో కాకినాడ కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, ఐఐటీ మద్రాస్ ఓషన్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎస్.ఎ.సన్నాసిరాజ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖతీబ్ కౌసర్ బానో, ఏపీ మారిటైమ్ బోర్డ్ చీఫ్ ఇంజనీర్ జి.వి.రాఘవరావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |