UPDATES  

NEWS

 డిసెంబర్‌లో ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌’.. భారీ పెట్టుబడులే లక్ష్యం..

తెలంగాణకు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబరులో ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌’ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సదస్సును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ఏడాది సదస్సు ద్వారా వచ్చిన పెట్టుబడులు, సాధించిన పురోగతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు.

గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లపై సీఎం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సదస్సు ద్వారా ప్రపంచస్థాయి పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వివిధ వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులను సదస్సులో సత్కరించేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. సంస్థాగత ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.

గత ఏడాది సదస్సు తర్వాత తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు, వాటి పురోగతిపై వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని మరిన్ని పెట్టుబడులు సాధించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

ఇదే సమావేశంలో హైదరాబాద్‌ మెట్రో రైలు ఫేజ్‌-2 పనులపైనా సీఎం సమీక్షించారు. పాతబస్తీలో ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో రోడ్డు విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మెట్రో పనులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. పెండింగ్‌ భూసేకరణను పూర్తి చేసి విస్తరణ ప్రణాళికలను ఖరారు చేయాలని చెప్పారు.

హైదరాబాద్‌ మెట్రోలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు కోచ్‌లు సమకూర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. పాతబస్తీ మెట్రో మార్గంలో అనుసరించాల్సిన సాంకేతికతపై ఢిల్లీ మెట్రో అధికారులతో సంప్రదించాలని సూచించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |