UPDATES  

NEWS

 ఏపీలో పెట్టుబడులకు తైవాన్ ఆసక్తి.. చంద్రబాబు, లోకేశ్ తో దిగ్గజ కంపెనీల ప్రతినిధుల భేటీ..

ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్‌కు చెందిన పలు దిగ్గజ కంపెనీలు ఆసక్తి చూపాయి. ఈ మేరకు తైవాన్ పారిశ్రామిక ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం బుధవారం అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ లతో వేర్వేరుగా సమావేశమైంది. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, ఐటీ, అధునాతన తయారీ రంగాల్లో ఏపీతో భాగస్వామ్యం పెంచుకోవడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.

 

డెల్టా ఎలక్ట్రానిక్స్, బెన్‌క్యూ, సీబీటీసీ బ్యాంక్, డైమెర్కో, మాస్టర్ హిల్, శాండ్ సన్, జిలీ కన్‌స్ట్రక్షన్స్ వంటి పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలకు అందుబాటులో ఉన్న సానుకూల వాతావరణాన్ని వారికి వివరించారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, పోర్టులు, విమానాశ్రయాలు, పటిష్టమైన రోడ్డు, రైలు మార్గాల ద్వారా బలమైన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను రాష్ట్రం కలిగి ఉందని తెలిపారు. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు విధానపరమైన స్థిరత్వం, వేగవంతమైన అనుమతులు, పూర్తిస్థాయి ప్రోత్సాహకాలు అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

 

భారత్‌లో తమ దేశ సంస్థలు ఇప్పటికే తయారీ రంగంలో కీలకంగా ఉన్నాయని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు విస్తరించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామని తైవాన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. తయారీ రంగం, సాంకేతికత, పారిశ్రామికాభివృద్ధిలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.

 

మంత్రి లోకేశ్ తో నైపుణ్యాభివృద్ధిపై చర్చలు

అనంతరం ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ తో తైవాన్ ప్రతినిధి బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా మానవ వనరుల అభివృద్ధి, ఏపీ యువతకు నైపుణ్యాల కల్పనపై చర్చించారు. తైవాన్ తయారీ, సాంకేతిక రంగాల్లోని ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేలా ఏపీ యువతకు అవసరమైన శిక్షణ, ఉన్నత విద్యా భాగస్వామ్యంపై లోకేశ్ వారితో విస్తృతంగా మాట్లాడారు. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల తయారీ, ప్రిసిషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ వంటి హై-స్కిల్ రంగాలలో పరస్పర సహకారానికి నిర్ణయించారు.

 

ఈ సందర్భంగా ప్రపంచ స్థాయి నైపుణ్య గ్రిడ్‌ను నిర్మించడం, యువతకు మాండరిన్ భాషలో శిక్షణ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సర్టిఫికేషన్, ఇంటర్న్‌షిప్‌లు, విద్యార్థి-ఫ్యాకల్టీ మార్పిడి కార్యక్రమాలు, సంయుక్త పరిశోధనలపై కూడా చర్చలు జరిగాయి. ఏపీ, తైవాన్ మధ్య సంబంధాలలో ఈ సమావేశాలు ఒక కీలక మైలురాయిగా నిలవనున్నాయి. పారిశ్రామిక పెట్టుబడులతో పాటు, నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |