UPDATES  

NEWS

 స్థానిక ఎన్నికలే లక్ష్యం.. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ హైలెవల్ మీటింగ్..!

ఢిల్లీలోని ఏఐసీసీ నూతన కార్యాలయం ‘ఇందిరా భవన్’ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ పీసీసీ కోఆర్డినేషన్ కమిటీ కీలక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. వీరితో పాటు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, సీడబ్ల్యూసీ సభ్యులు దామోదర రాజనర్సింహ, వంశీచంద్ రెడ్డి తదితర సీనియర్ నేతలు హాజరయ్యారు.

 

పార్టీ, ప్రభుత్వ సమన్వయంపై ప్రత్యేక దృష్టి

 

ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఇప్పటివరకు కోఆర్డినేషన్ కమిటీ తీసుకున్న నిర్ణయాల అమలు తీరుపై ప్రత్యేక సమీక్ష నిర్వహించింద. ‘SIR’ ప్రక్రియ అమలును వేగవంతం చేయడంపై నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోని ప్రతి ఇంటికీ తీసుకెళ్లి ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేశారు. అంతేకాకుండా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయావకాశాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా ఆలోచనలు పంచుకున్నారు.

 

కేటీఆర్‌కు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్

 

సమావేశం అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాల విమర్శలను తీవ్రంగా ఖండించారు. మంత్రులు ఢిల్లీ పర్యటనకు వచ్చినంత మాత్రాన రాష్ట్రంలో పరిపాలన నిలిచిపోదని స్పష్టం చేశారు. కేవలం ఈ సమావేశం కోసమే కాకుండా, ఏఐసీసీ అధిష్టానం , ఇతర సీనియర్ నాయకులను కలవడానికి మంత్రులు ఇక్కడికి వచ్చారని చెప్పారు. ఇక నగర పరిధిలో ‘హైడ్రా’ సమర్థంగా పనిచేస్తూ ఎన్నో ఏళ్లుగా ఉన్న అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిందని ప్రశంసించారు. బిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ చేసే అర్థరహిత వ్యాఖ్యలను తెలంగాణలో ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదని ఈ సందర్భంగా ఆయన ఎద్దేవా చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |