UPDATES  

NEWS

 హైదరాబాద్ పోలీసుల అదుపులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి..!

మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో ఆయన్ను గుర్తించిన పోలీసులు, అనంతరం హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 

హైదరాబాద్ శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 18న అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. శిక్షణ సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధించాడని, దాడికి పాల్పడటంతో పాటు వెంబడించి బెదిరించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు తెలియకుండా ప్రైవేట్ వీడియోలు తీసి, వాటిని తన భర్తకు పంపి బ్లాక్ మెయిల్ చేశారని కూడా ఆమె ఆరోపించారు.

 

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద లైంగిక వేధింపులు, దాడి, వెంబడించడం, అక్రమ నిర్బంధం, క్రిమినల్ బెదిరింపులతో పాటు ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఈ కేసు దర్యాప్తును హైదరాబాద్ ఉమెన్స్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది.

 

తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ ఉదయ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. మరోవైపు, తాను పరారీలో లేనని, అనారోగ్యంతో ఉన్న తన నానమ్మను చూసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఊళ్లపాలెం గ్రామానికి వెళ్లానని ఉదయ్ రెడ్డి మీడియాకు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని, విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు.

 

ఈ కేసులో నమోదైన సెక్షన్లు, లభ్యమైన ఆధారాల ప్రకారం పారదర్శకంగా దర్యాప్తు జరుపుతామని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. అన్ని కోణాల్లోనూ విచారణ చేపడతామని ఆయన స్పష్టం చేశారు. కాగా, అంతర్గత విచారణలో ప్రాథమికంగా తప్పు తేలడంతో జాతీయ పోలీస్ అకాడమీ ఇప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డిని శిక్షణ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |