UPDATES  

NEWS

 రాజకీయాల్లోకి ‘కాక్రోచ్ జనతా పార్టీ’..?

నీట్ పేపర్ లీక్ వివాదంపై నెల రోజులుగా సాగుతున్న ఆందోళనలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాతో ముగిశాయి. నిరసనలకు నాయకత్వం వహించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో సుదీర్ఘ పోరాటం ముగిసింది. అయితే, ఈ విజయం తర్వాత సీజేపీ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తుందా? అనే చర్చ మొదలైంది. దీనిపై ఆ పార్టీ నేతలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

 

ఈ పరిణామాల అనంతరం ‘ఎన్డీటీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ తమ భవిష్యత్ ప్రణాళికలపై స్పందించారు. పూర్తిస్థాయి రాజకీయ ప్రవేశంపై అశుతోష్ రంకాను ప్రశ్నించగా “భారత్‌లో దేనికీ నో చెప్పకూడదు అని నేను భావిస్తున్నాను” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రస్తుతం తన ఆలోచనలన్నీ ఇంటికి వెళ్లి కుటుంబంతో గడపడంపైనే ఉన్నాయని, గత రెండు నెలలుగా జరిగిన పరిణామాల నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని తెలిపారు.

 

మరోవైపు సౌరవ్ దాస్ మాట్లాడుతూ రాజకీయాలు తమ తక్షణ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. “దేశంలో ఇప్పటికే 750-800 రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ ఏవీ యువత ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్నాయి. అందుకే మేము ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లి బలోపేతం చేయాలనుకుంటున్నాం. అధికారంలో ఏ పార్టీ ఉన్నా, యువత కోసం పనిచేసేలా ఒత్తిడి తీసుకురావడమే మా ప్రస్తుత ఎజెండా” అని వివరించారు.

 

మే నెలలో ఆన్‌లైన్ ప్రచారంగా మొదలైన సీజేపీ ఉద్యమం, జూన్ 20న జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరసనతో దేశవ్యాప్త గుర్తింపు పొందింది. ప్రభుత్వంతో పలు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం శనివారం తుది ఒప్పందం కుదిరింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |