UPDATES  

NEWS

 ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కేంద్రం నో..?

నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనలు ఉద్ధృతం చేసినప్పటికీ, ఆయన రాజీనామాకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని తెలుస్తోంది. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

 

“రాజీనామా చేయడం చాలా తేలికైన నిర్ణయం. కానీ ప్రజలు మాకు అధికారం ఇచ్చింది బాధ్యతలను నిర్వర్తించడానికే తప్ప, పారిపోవడానికి కాదు. మేము వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం” అని ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో నెలకొన్న వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించడం, పేపర్ లీక్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవడంపైనే ప్రస్తుతం ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

 

శుక్రవారం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న సీజేపీ విద్యార్థులతో కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలు జరిపింది. ప్రభుత్వ ప్రతినిధులుగా కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడం, శాంతియుత నిరసనకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవడం వంటి అంశాలకు సూత్రప్రాయంగా అంగీకరించిన ప్రభుత్వం, మంత్రి రాజీనామా విషయంలో మాత్రం శనివారం మధ్యాహ్నం వరకు గడువు కోరినట్లు కాక్రోచ్ జనతా పార్టీ తెలిపింది. అయితే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళనలు విరమించే ప్రసక్తే లేదని సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, అభిజీత్ దీప్కే తేల్చి చెప్పారు.

 

ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని బదిలీ చేసి, కీలక విభాగాల్లో కొత్త అధికారులను నియమించింది. మరోవైపు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇతర విద్యా సంబంధిత అంశాలపై సోషల్ మీడియాలో చురుకుగా వ్యవహరిస్తూనే, పేపర్ లీక్‌లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను షేర్ చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |