UPDATES  

NEWS

 కూటమి సర్కార్‌పై వైసీపీ మాజీ మంత్రుల సంచలన సమరశంఖం..!

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి వేదికగా మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్, విడదల రజిని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, వారిని రాజకీయంగా, ఆర్థికంగా అణచివేస్తున్నారని ధ్వజమెత్తారు.

 

చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ..

 

మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బీసీలను బానిసలుగా మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. రుణాల కోసం దాదాపు రెండు లక్షల మంది బీసీ యువకులు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. మహిళలకు కుట్టు మిషన్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని, ఆదరణ పథకం కింద బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించినట్లు చూపి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆదుకుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మిగిలిన 16 కార్పొరేషన్లకు పాలకవర్గాలను కూడా వేయలేదని, అసలు ఆ కార్పొరేషన్లకు ఎంత నిధులు కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి అద్దాల మేడల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, బీసీలకు మాత్రం మొండిచేయి చూపిస్తోందని ధ్వజమెత్తారు.

 

జోగి రమేశ్ మాట్లాడుతూ..

 

మరొక మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆగస్టు 9న విజయవాడలో ‘బీసీల రణభేరి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. బీసీలంటే ‘బ్యాక్ వర్డ్ క్యాస్ట్’ కాదు, సమాజానికి ‘బ్యాక్ బోన్’ అని జగన్ నిరూపించారని, కానీ చంద్రబాబు వారిని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. బీసీల ఐక్యతను చాటిచెప్పి, ప్రభుత్వ కుట్రలను ఎండగడతామన్నారు.

 

విడదల రజిని మాట్లాడుతూ..

 

మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీలోని బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, తనపై కూడా పది అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. గుంటూరులో బీసీ మహిళను అవమానించిన ఘటనను గుర్తు చేస్తూ, ప్రభుత్వం బీసీలపై పైశాచిక ఆనందం పొందుతోందని విమర్శించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని, బీసీలందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |