UPDATES  

NEWS

 తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్: అదనపు ధాన్యం కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో అదనపు పరిమాణంలో వరి ధాన్యాన్ని సేకరించేందుకు కేంద్రం ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా మరో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సవరించిన అంచనాల ప్రకారం, మొత్తం సేకరణ పరిమితిని 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

 

ధాన్యం కొనుగోలు కోటాను పెంచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా, ధాన్యం నిల్వ, రవాణా పరంగా ఎదురయ్యే సవాళ్లు కూడా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.

 

వరి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ కీలక రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. కేంద్రం నుంచి ఇలాంటి సానుకూల నిర్ణయం వెలువడటం వల్ల మార్కెట్లు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఫలితంగా రైతులు ఆందోళనతో తమ పంటను తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తదు. ప్రస్తుత సీజన్‌లో రైతులకు మేలు చేకూర్చే లక్ష్యంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. అదనపు ధాన్యం సేకరణ ప్రక్రియ, గడువు తదితర అంశాలపై త్వరలోనే పూర్తిస్థాయి స్పష్టత రానుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |