UPDATES  

NEWS

 రణరంగంగా దేశ రాజధాని.. కదంతొక్కిన విద్యార్థులు..

నీట్-యూజీ పరీక్షల నిర్వహణలో అవకతవకల అంశం దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ మద్దతుదారులు, విద్యార్థులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నేడు ఐదు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. నిన్న‌ జరిగిన ఈ ఆందోళనల్లో 118 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

 

వివరాల్లోకి వెళితే.. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ సీజేపీ కార్యకర్తలు, వేలాది మంది విద్యార్థులు సోమవారం జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో నిరసనకారులు బారికేడ్లను ఛేదించుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

 

దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనల్లో ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలకు చెందిన 118 మంది సిబ్బంది గాయపడ్డారు. వీరిలో స్పెషల్ కమిషనర్, జాయింట్ కమిషనర్, అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్ వంటి ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తమ ‘ఎక్స్’ ఖాతాలో తెలిపారు.

 

ఈ హింసాత్మక ఘటనలపై కన్నాట్ ప్లేస్, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లతో పాటు ఇతర పరిసర ప్రాంతాల్లో మొత్తం ఐదు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హింస జరిగిన ప్రాంతాలను బట్టి మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. నిందితులను గుర్తించేందుకు 250కి పైగా వీడియోలను పరిశీలిస్తున్నారు. వీటిలో మొబైల్ ఫోన్ రికార్డింగులు, సీసీటీవీ ఫుటేజీ, డ్రోన్ కెమెరా విజువల్స్, పోలీసుల బాడీ-వోర్న్ కెమెరాల ఫుటేజీలు ఉన్నాయి.

 

ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన సిబ్బందిని పరామర్శించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, మనోధైర్యం నింపారు. “విధి నిర్వహణలో యూనిఫాంపై అయిన ప్రతి గాయం, మీ అంకితభావానికి నిదర్శనం” అని కమిషనర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సమస్యాత్మక ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |