UPDATES  

NEWS

 ‘స్విగ్గీ’ సరికొత్త సేవ..! స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో గ్యాస్ సిలిండర్..!

ఆన్‌లైన్ ఫుడ్, గ్రోసరీ డెలివరీ దిగ్గజం ‘స్విగ్గీ’ వినియోగదారుల కోసం మరో సరికొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. ప్రముఖ చమురు సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో చేతులు కలిపి ఆన్-డిమాండ్ ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీని ప్రారంభించింది. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ సేవ ద్వారా ఆర్డర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సిలిండర్ వినియోగదారుడి ఇంటికి చేరుతుంది. తొలిదశలో భాగంగా బుధవారం బెంగళూరులో ఈ సేవలను ప్రారంభించారు.

 

వినియోగదారులు ఇకపై స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ యాప్ ద్వారా నేరుగా గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా హెచ్‌పీసీఎల్‌కు చెందిన 10 కేజీల కంపోజిట్ సిలిండర్ (హెచ్‌పీ నవ్య)తో పాటు, 5 కేజీల సాధారణ మెటల్ సిలిండర్ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ‘హెచ్‌పీ నవ్య’ సిలిండర్‌ పారదర్శకంగా ఉండటం వల్ల గ్యాస్ స్థాయిని సులభంగా చూసుకోవచ్చు. అయితే, ఈ సేవను పొందేందుకు వినియోగదారులకు ముందే గ్యాస్ కనెక్షన్ ఉండాలన్న నిబంధన ఏమీ లేకపోవడం విశేషం.

 

భద్రతా ప్రమాణాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, ఈ డెలివరీలను స్విగ్గీ సాధారణ సిబ్బంది కాకుండా హెచ్‌పీసీఎల్ అధీకృత డిస్ట్రిబ్యూటర్ల ద్వారా నిర్వహిస్తారు. తొలిసారి ఆర్డర్ ఇచ్చే వినియోగదారుల గుర్తింపు కార్డులను పరిశీలిస్తారు. ఆ తదుపరి ఆర్డర్ల నుంచి పాత సిలిండర్ ఇచ్చి కొత్తది తీసుకునే (ఎక్స్చేంజ్) విధానంలో డెలివరీ కొనసాగుతుంది. ఈ భాగస్వామ్యం ద్వారా నిత్యావసర సేవలను మరింత సులభతరం చేస్తున్నామని, భద్రత విషయంలో రాజీ పడబోమని ఇన్‌స్టామార్ట్ సీఈఓ అమితేష్ ఝా వెల్లడించారు. సాంప్రదాయ గ్యాస్ బుకింగ్‌ ప్రక్రియలో ఎదురయ్యే ఆలస్యాన్ని, ఇతర ఇబ్బందులను ఈ సేవ దూరం చేయనుంది. ప్రస్తుతానికి బెంగళూరులో మాత్రమే ప్రారంభమైన ఈ సేవను ఇతర నగరాలకు ఎప్పుడు విస్తరిస్తారనే విషయంపై సంస్థ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |