UPDATES  

NEWS

 రేవంత్ కోసమే సీమ ప్రాజెక్టును చంద్రబాబు ముంచేశారు.. సజ్జల సంచలనం..!

రాయలసీమ ఎత్తిపోతల పథకం (రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్) ఉనికిని కాపాడుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైంది. నెల్లూరులో వైసిపీ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు నిర్వీర్యంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైసిపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

 

సీమ, నెల్లూరు జిల్లాలకు తీరని అన్యాయం

 

శ్రీశైలం ప్రాజెక్టులో 101 టీఎంసీల నికర జలాల భాగస్వామ్యం ఉన్నప్పటికీ, అది ఆచరణలో సాధ్యం కాకపోవడం లేదన్నారు. దీనివల్ల రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది తెలిపారు. ఈ పరిస్థితిని ముందే ఊహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. దాదాపు రూ.900 కోట్ల బిల్లులు చెల్లించి, 80 శాతం పనులను కూడా పూర్తి చేశారని.. ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) ఆంక్షలు, అనేక సవాళ్లను అధిగమించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారని సజ్జల పేర్కొన్నారు.

 

రేవంత్ రెడ్డి కోసం చంద్రబాబు తాకట్టు

 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడం వల్లే చంద్రబాబు ఈ ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేశారని సజ్జల ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి దీనిపై వివరణ ఇచ్చినా.. చంద్రబాబు ఇప్పటివరకు నోరు మెదపకపోవడం వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ వారు రోజూ 8 టీఎంసీలు వాడుకుంటుంటే, మనకు ఈ ప్రాజెక్టు పూర్తయితే వచ్చేది కేవలం 3 టీఎంసీలు మాత్రమే.. అయినప్పటికీ చంద్రబాబు మన రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు.

 

దోపిడీపైనే బాబు దృష్టి

 

ప్రస్తుతం ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల నీటి ఎద్దడి ఏర్పడి, అందరికీ నీటి అవసరాలు గుర్తొస్తున్నాయని సజ్జల పేర్కొన్నారు. చంద్రబాబుకు కేవలం దోపిడీకి అవకాశం ఉన్న ప్రాజెక్టులపైనే శ్రద్ధ ఉంటుందని విమర్శించారు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. పోలవరం ప్రాజెక్టుపై స్పష్టత ఇవ్వకుండా, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి పోలవరం-బనకచర్ల అంటూ కొత్త డైవర్షన్ రాజకీయాలు మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

అమరావతి తరహాలోనే ప్రతిదాన్ని ఆదాయ వనరుగా మార్చుకుంటూ చంద్రబాబు ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని సజ్జల దుయ్యబట్టారు. చంద్రబాబు చేస్తున్న ఈ మోసాన్ని, రాయలసీమ లిఫ్ట్ ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడానికే టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో పోరాట కార్యాచరణను సిద్ధం చేసినట్లు ఆయన ప్రకటించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |